logo

సైదన్న సన్నిధి.. భక్తులకు పెన్నిధి

తెలుగు రాష్ట్రాల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తున్న జాన్‌ పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఉభయ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. పేరుకు ఇస్లాం మతానికి చెందిన దర్గా అయినప్పటికీ హిందువులు

Published : 26 Jan 2022 04:40 IST

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉర్సు ఉత్సవాలు

వెలుగువీలుతున్న జాన్‌పహాడ్‌ దర్గా

పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తున్న జాన్‌ పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఉభయ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. పేరుకు ఇస్లాం మతానికి చెందిన దర్గా అయినప్పటికీ హిందువులు అధిక సంఖ్యలో సైదన్న దర్శనానికి వస్తారు. హిందూ ముస్లిం ఐక్యతకు జాన్‌పహాడ్‌ దర్గా తెలుగు రాష్ట్రాల్లో పేరుగాయించింది.
ఇదీ చరిత్ర... ఇరాన్‌ దేశానికి చెందిన హజ్రత్‌ సయ్యద్‌ మొహినోద్దీన్‌షా జాన్‌పాక్‌ షహీద్‌ అతని అనుచరులు ఇస్లాం బోధనలు వ్యాప్తి చేయడానికి దక్షణ భారతదేశానికి విచ్చేశారు. ఈ ప్రాంతంలో వారి వ్యతిరేక వర్గమైన వాడపల్లి రాజుతో జరిగిన యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ ముహినోద్దీన్‌ ప్రస్తుతం జాన్‌పహాడ్‌ దగ్గర ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో అమరుడయ్యారు. ఆయన జ్ఞాపకార్ధం సుమారు 400 ఏళ్ల క్రితం ఈ దర్గాను నిర్మించారు.
సఫాయి బావి పవిత్ర నీరు... సఫాయి బావి నీటిని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు. ఆ నీటిని స్నానం చేయడానికి, తీర్ధ ప్రసాదాల తయారీకి వినియోగిస్తారు. తీవ్ర నీటి కరవుతో ప్రజల సమస్యలు తీర్చడానికి ఆనాటి వాడపల్లి రాజు భూపతిరాజు శేషారెడ్డి కలలో కనిపించిన సైదులు బాబా గుర్రపు డెక్కలు గుర్తుగా ఉన్నచోట బావిని తవ్వించాలని ఆదేశించినట్లు చరిత్ర చెబుతోంది.

దీపం ప్రత్యేకత... దర్గా లోపల సైదులు బాబా తల వద్ద ఉన్న నూనె దీపానికి వందల ఏళ్ల చర్రిత ఉంది. ఆ దీపం దర్గా నిర్మించిన నాటి నుంచి నిరంతరం వెలుగులీనుతోనే ఉండటం విశేషం. దర్గాను సందర్శించిన భక్తులు దీపానికి నెయ్యి, నూనెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. హిందూ దేవాలయాల మాదిరిగా దీపారాధన జరుగుతుండటం జాన్‌పహాడ్‌ దర్గా ప్రత్యేకతగా చెప్పొచ్చు.
భక్తుల కొంగుబంగారు నాగేంద్రస్వామి పుట్ట... దర్గా ఆవరణలో ఉన్న నాగేంద్రస్వామి పుట్ట భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తుంది. ఆనాడు అటవీ ప్రాంతంలో భక్తులకు రక్షణగా నాగేంద్రుడు వెలిశాడని ఒక కథ ప్రచారంలో ఉంది. నాగేంద్రునికి భక్తులు పూజలు చేసి పాలు, గుడ్లు, సజ్జ మొలకలు, పండ్లు, పసుపు కుంకుమలు సమర్పిస్తారు.
పంచ పహాడ్‌... జాన్‌పహాడ్‌ చుట్టుపక్కల మరో నాలుగు పహాడ్‌లున్నాయి. ఇవి జాన్‌పహాడ్‌, గుండ్ల పహాడ్‌, శూన్యపహాడ్‌, గణేష్‌పహాడ్‌, రావిపహాడ్‌. ఇవి పంచభూతాలకు సాక్షంగా నిలుస్తున్నాయని భారతీయ సనాతన ధర్మంలోని అంశాలకు అనుగుణంగా ఉన్నాయని భక్తులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని