logo

ఖజానా ఖాళీ..బిల్లుల లొల్లి!

పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నా నిధుల విడుదలలో తీవ్ర జాప్యమవుతోంది. పారిశుద్ధ్యం, తాగునీరు, సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, వీధి దీపాలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ట్రాక్టర్ల నిర్వహణ పనులకు

Published : 27 May 2022 03:06 IST

సర్పంచులకు తప్పని తిప్పలు
అభివృద్ధి పనులపై ప్రభావం

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నా నిధుల విడుదలలో తీవ్ర జాప్యమవుతోంది. పారిశుద్ధ్యం, తాగునీరు, సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, వీధి దీపాలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ట్రాక్టర్ల నిర్వహణ పనులకు కొంతమంది సర్పంచులు అప్పులు తెచ్చి నిధులు వినియోగిస్తున్నారు. పనులు పూర్తి కాగానే బిల్లుల చెల్లింపు జరుపకపోవడంతో కొత్త పనులు చేపట్టడంలో జాప్యమవుతోంది. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సర్పంచులు సొంత డబ్బులు వెచ్చించి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. బిల్లులు అందకపోవడంతో సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పంచాయతీలకు సంబంధించి రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  
ప్రభుత్వం వద్ద నిధులు లేవు.. ఖజానాలు ఖాళీ అయ్యాయి. దీంతో కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపునకు బ్రేక్‌ పడింది. స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బిల్లులు గత కొన్ని రోజుల నుంచి అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగుల మెడికల్‌ బిల్లులు, పదవీ విరమణ డబ్బు, గృహావసరాలు, కార్యాలయాల నిర్వహణ బిల్లులు సకాలంలో అందడం లేదు. ఉద్యోగులకు అవసరమైన చెల్లింపుల్లోనూ ఇదే పరిస్థితి.. వారి ఖాతాల్లో నిధులు జమ కావడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల, సర్పంచులు చేసిన అభివృద్ధి పనులు, ఇతర శాఖల్లో గుత్తేదారులకు సంబంధించి దాదాపు వంద కోట్లకు పైగా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంలో మార్చి చివరి వారంలో కొన్ని బిల్లుల చెల్లింపులు నిలిపివేసేందుకు ప్రభుత్వం ట్రెజరీల్లో అధికారికంగా ఫీజింగ్‌ అమలు చేసేది. కానీ ఇటీవల అనధికారికంగా నెలల తరబడి బిల్లులు చెల్లింపు చేయకపోవడంతో అనేక మంది అవస్థలు పడుతున్నారు.  
ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో రూ. కోట్లలో అభివృద్ధి పనులు నడుస్తున్నా సకాలంలో బిల్లులు రాకా గుత్తేదారులు మధ్యలోనే పనులు నిలిపివేస్తున్నారు. ప్రధాన రహదారులు, వంతెనలు, రెండు పడుక గదుల ఇళ్ల నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ట్రెజరీ అధికారులు ఎప్పటికప్పుడు బిల్లులకు ఆమోదం తెలుపుతున్నా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడంలో జాప్యమవుతోంది. ప్రతి నెలా 1న ఉద్యోగులకు అందాల్సిన జీతాలు 10వ తేదీలోపు దశల వారీగా జమవుతున్నాయి పింఛన్లు వారం రోజులు ఆలస్యంగా వస్తున్నట్లు పేర్కొంటున్నారు. రాష్ట్ర సర్కార్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో అనుసంధానమైనప్పటి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ఈ-కుబేర్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానం పాటిస్తున్నారు. ఆర్థిక శాఖ సూచనల మేరకే ఆయా బిల్లులు ఆర్‌బీఐ నేరుగా ఆయా ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాల ఆధారంగా ఈ బిల్లుల చెల్లింపులు చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో నిధులు సర్ధుబాటు కావడం లేదని ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతర బిల్లుల కోసం గుత్తేదారులు తదితరులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండడంతో రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులకు జీతాలు, అత్యవసర పనులకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు.

నెలల తరబడి
ట్రెజరీ శాఖ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 45 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 15 వేల మందికి పైగా వేతన పింఛను ఖాతాదారులు ఉన్నారు. జీతభత్యాలు, భవిష్యనిధి, కార్యాలయాల నిర్వహణ, అద్దెలు, వాహన కిరాయిలు, విద్యుత్‌ బిల్లులు, వైద్య ఖర్చులు తదితరాలకు ఖర్చు చేసిన బిల్లుల కోసం కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయానికి వస్తుంటారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ జీపీఎఫ్‌, వేతన స్థిరీకరణ బకాయిల బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.  
ఆర్థికశాఖ క్లియరెన్స్‌తో ఖాతాల్లో జమ
ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన బిల్లులకు ఎప్పటికప్పుడు ట్రెజరీ శాఖలో ఆమోదం తెలుపుతూ వెంటనే ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు. ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇవ్వడంతోనే ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని