logo

ఇంటింటికీ పోల్‌ చిట్టీలు..!

ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్‌ చిట్టీలు పంపిణీ చేస్తోంది.

Published : 27 Apr 2024 02:47 IST

మిర్యాలగూడలో పోల్‌ చిట్టీల పంపిణీని పరిశీలిస్తున్న తహసీల్దారు హరిబాబు

మిర్యాలగూడ పట్టణం, కనగల్‌, మునగాల, న్యూస్‌టుడే: ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్‌ చిట్టీలు పంపిణీ చేస్తోంది. మే 13న ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోల్‌ చిట్టీల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఓటరు జాబితాలో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరికి బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ పోల్‌ చిట్టీలు పంపిణీ చేస్తున్నారు. ఏ రోజు ఎన్ని పోల్‌ చిట్టీలు పంపిణీ చేశారనేది సాయంత్రం ఉన్నతాధికారులకు నివేదిక సైతం పంపిస్తున్నారు.

అసలెందుకంటే..

ఎన్నికల సమయంలో ఓటరు పోలింగ్‌ బూత్‌కు వెళ్లినప్పుడు.. ఓటరు జాబితాలో క్రమసంఖ్య, పోలింగ్‌ కేంద్రం పేరు తదితర వివరాలను పోలింగ్‌ అధికారులతో పాటు ఆయా పార్టీల ఏజెంట్లు సైతం మార్క్‌ చేసుకుంటారు. వారి పేర్లను ఓటరు జాబితాలో వెతకడంతో సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓటరుతో పాటు పోలింగ్‌ కేంద్రం వివరాలతో పోల్‌ చిట్టీలు ముద్రించి ముందుగానే ఓటర్లకు పంపిణీ చేస్తారు. దీన్ని తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లినప్పుడు అందులోని వివరాలతో పోలింగ్‌ అధికారులు, పార్టీల ఏజెంట్లు సులభంగా ఓటరు జాబితాలో మార్క్‌ చేసుకుంటారు.

పోల్‌ చిట్టీలో ముద్రించే వివరాలు..

పోల్‌ చిట్టీలో శాసనసభ నియోజకవర్గం, సంఖ్య, ఓటరు పేరు, లింగము, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య, తండ్రి పేరు, పోలింగ్‌ లొకేషన్‌, పోలింగ్‌ కేంద్రం సంఖ్య, పోలింగ్‌ కేంద్రం భవనం వివరాలు, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌, కాల్‌ సెంటర్‌ నంబర్‌ తదితర వివరాలు ముద్రిస్తారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని