logo

‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి

రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు.

Published : 27 Apr 2024 02:40 IST

హుజూర్‌నగర్‌, హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. దేశంలో పార్టీలకు గుర్తుల కేటాయింపులు ఎలా జరిగాయి.. జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలా మార్పులు చేసుకున్నాయో తెలుసుకుందాం రండి.


స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే హస్తం కాంగ్రెస్‌కు..

హస్తం గుర్తు అంటే వెంటనే కాంగ్రెస్‌ అంటారు. కానీ దేశంలో జాతీయ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు ఒకటి, రెండు సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు హస్తం గుర్తు కేటాయించారు. 1977లో కాంగ్రెస్‌కు కేటాయించారు. 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ‘కాడెడ్ల’ గుర్తును కేటాయించారు. ఈ గుర్తుతోనే అప్పుడు కాంగ్రెస్‌ పోటీ చేసి గెలిచింది. తరువాత ఇందిరా గాంధీ, కాసు బ్రహ్మానందరెడ్డి మధ్య తలెత్తిన విభేదాలు పార్టీ చీలికకు దారితీశాయి. దీంతో ఇందిరా కాంగ్రెస్‌తో ఏర్పడిన కాంగ్రెస్‌(ఐ)కి 1971లో ఎన్నికల సంఘం ‘ఆవుదూడ’ గుర్తు ఇచ్చింది. ఆ గుర్తుతోనే 1971లో పోటీ చేశారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో చీలిపోయిన కాంగ్రెస్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ పేరుతో 1977లో విలీనమైంది. అప్పుడు ఎన్నికల సంఘం ‘హస్తం’ గుర్తు కేటాయించింది. అప్పటి నుంచి ఇదే గుర్తుతో కాంగ్రెస్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.


నాడు వెలిగే దీపం.. నేడు కమలం..

జన సంఘ్‌ పార్టీని 1951లో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ దిల్లీలో స్థాపించారు. ఆ పార్టీ గుర్తు ‘వెలిగే దీపం’. 1977లో జనసంఘ్‌ పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు. అప్పుడు జనతా పార్టీకి ‘రైతు నాగలి’ గుర్తును కేటాయించారు. 1980లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన పూర్వపు జన సంఘ్‌ నాయకులంతా కలిసి భారతీయ జనతా పార్టీ(భాజపా)ని స్థాపించారు. అప్పటి నుంచి భాజపా ‘కమలం’ గుర్తుతో ఎన్నికలలో పోటీ చేస్తోంది.


మొదట కమ్యూనిస్టులు పోటీ చేసింది హస్తం పైనే:

1952 ఎన్నికల సమయానికి కమ్యూనిస్టు పార్టీలపై నిర్భంధం ఉండటంతో కమ్యూనిస్టులు మొదటి సారి జరిగిన ఎన్నికల్లో 1952లో పీడీఎఫ్‌ పేరుతో పోటీకి దిగారు. అప్పుడు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ‘హస్తం’ గుర్తును ఎన్నికల సంఘం వారికి కేటాయించింది. ఈ గుర్తుతోనే మన రాష్ట్రంలో కమ్యూనిస్టు నాయకులు విజయ ఢంకా మోగించారు. తరువాత సీపీఐకి ‘కంకి కొడవలి’, సీపీఎంకు ‘సుత్తి కొడవలి నక్షత్రం’, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ)కి సింహం గుర్తును కేటాయించారు. ఇవే గుర్తులతో కమ్యూనిస్టులు ప్రస్తుతం పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని