logo

ప్రజల మనిషి ధర్మభిక్షం

మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది.

Published : 27 Apr 2024 02:39 IST

మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. చదువుతోనే జీవితాలు మారతాయని భావించిన తాము విద్యాభ్యాసం చేస్తూనే విద్యార్థుల కోసం హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర, వందేమాతరం, జమీందారీ వ్యతిరేక ఉద్యమాల్లో విద్యార్థి నాయకుడిగా పాల్గొన్నారు. ఆర్యసమాజ్‌ కార్యకర్తగా సంఘసేవతో పాటు శాకాహారిగా, బ్రహ్మచారిగా మారార[ు. ప్రజా ఉద్యమ నేత. మీజాన్‌, రయ్యత్‌, గోల్కొండ పత్రికలకు పాత్రికేయుడిగా పని చేశారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పేదలకు భూమి, భుక్తి, విముక్తి కోసం తుపాకీ చేతబట్టి పోరాటం సాగించారు. అజ్ఞాతవాసం చేశారు. జైలు జీవితం అనుభవించారు. నైజాం ప్రభుత్వం అంతమయ్యాక మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు. సోవియట్‌ రష్యా సందర్శించారు. 90 ఏళ్ల జీవితమంతా ప్రజలకే అంకితం చేసి సొంత ఆస్తులు కూడబెట్టుకోని నిరాడంబర, నిస్వార్ధనేత ధర్మభిక్షం జీవితం నేటి తరానికి, రాజకీయ నేతలకు ఆదర్ళం.  ఒక చేత్తో భిక్షం అడుగుతూ మరో చేత్తో ధర్మం చేస్తున్న వ్యక్తి పేరు ‘భిక్షం’ కాదు ఆయన ‘ధర్మ’భిక్షం అని కొత్వాల్‌ రాజబహదూర్‌ వెంకట్రామ్‌రెడ్డి అభినందించారు. అప్పట్నుంచీ ధర్మభిక్షంగా కొనసాగింది. మూసీ, ఎస్‌ఎల్‌బీసీ, నల్గొండ, వరంగల్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు గోదావరి జలాలను తెచ్చేందుకు ప్రభుత్వాన్ని ఆలోచింపజేశారు. ఫ్లోరిన్‌ పీడిత ప్రాంతాలకు, హైదరాబాద్‌కు నదీ జలాల పంపిణీకి కృషి చేశారు.

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే:

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని