logo

అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ.

Published : 27 Apr 2024 02:36 IST

ఉగాది మహానంది పురస్కారం అందుకుంటున్న ఆదె సత్యనారాయణ (పాత చిత్రం)

గుర్రంపోడు, న్యూస్‌టుడే: వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌కు చెందిన ఈయన హాలియా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో విద్యారంగంలో చేస్తున్న కృషికి ఈ నెల 14న శ్రీవిరాట్‌ విశ్వవిజ్ఞానాధ్యాత్మిక, ధార్మిక కళాపరిషత్తు, తెలుగు వెలుగు సాహితీ వేదికలు ఉగాది మహానంది పురస్కారం అందించి గౌరవించాయి. నిపుణ మ్యాగజైన్‌లో పోటీపరీక్షలకు ఉపయోగపడే అనేక వ్యాసాలు ఆదె రాశారు. ఇప్పటికీ వెనుకబడిన తరగతుల సామాజిక సంక్షేమ శాఖల స్టడీసర్కిళ్లు ఈయన సేవలను అందుకుంటున్నాయి. తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో రూపొందిన ప్రత్యేక సంచిక తెలుగు జర్నల్‌లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలంగాణ రాష్ట్ర పురోగతిని వీరు ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఆర్టికల్‌ ప్రచురించారు. తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పలు ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, బిట్‌బ్యాంకులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలను పుస్తకాల రూపంలో విద్యార్థులకు అందించారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూనే తెలంగాణ విద్యాశాఖ, ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో దశాబ్దకాలం పాటు రూపొందిన పలు వృత్యంతర శిక్షణ కార్యక్రమాల ద్వారా మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రిసోర్సుపర్సన్‌గా పనిచేసి ఉపాధ్యాయుల మన్ననలు పొందారు. గ్రూప్స్‌, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉపాధ్యాయ నియామకాలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టీశాట్‌ ఛానల్స్‌ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన వీడియో క్లాసుల్లో వీరి ప్రసంగాలు ఆదరణ పొందాయి.

అందుకున్న పురస్కారాలు

  • ఈ ఏడాది జనవరి 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ మాధ్యమంగా జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్సులో పాల్గొని ప్రతిభ చూపినందుకు కాంపిటెన్సీ నావిగేటర్‌ జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు. వైజాగ్‌ సిధ్వీ ఫౌండేషన్‌, పుదుచ్చేరి డివైన్‌మదర్‌ కాలేజీ సంయుక్తంగా ఈ అవార్డును అందజేశాయి.
  • జాతీయ స్థాయిలో విద్యారంగంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే కైట్స్‌ క్రాఫ్ట్స్‌ సంస్థ నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్సలెన్సు అవార్డు-2023 అందించింది.  
  • ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎడ్యుకేషన్‌ పర్యటనలు నిర్వహించే ఏకేఎన్‌ వరల్డ్‌వైడ్‌ సంస్థ గ్లోబల్‌ టీచర్‌ అవార్డు-2023ను అందించింది.
  • ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2022లో ఉపాధ్యాయ వృత్తిలో విశేష కృషి చేసే ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించే అక్షర ఫౌండేషన్‌ అక్షర జాతీయ పురస్కారం అందించింది.
  • తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ వృత్తిలో విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించే పుడమి సాహితీ వేదిక పుడమి విద్యారత్న-2022 జాతీయ పురస్కారాన్ని అందజేసింది.
  • అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి సమితి ఈయనకు తెలుగుతేజం పురస్కారం-2022 అందజేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని