logo

కృష్ణానదిలో ఔషధ విషం

కృష్ణా నదిలోనూ రసాయన వ్యర్థాలను నేరుగా కలిపేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతం బుగ్గమాధారం గ్రామస్థులు మేల్కొనడంతో ఈ నిర్వాకం బట్టబయలైంది. ఈ ప్రాంత మూగజీవాల దాహార్తిని తీరుస్తూ.. కృష్ణమ్మ ఒడికి చేరే బండవాగులోనే

Published : 26 Jun 2022 02:33 IST

ఎన్టీఆర్‌ జిల్లా ఫార్మా సంస్థల నిర్వాకం

బుగ్గమాధారం వద్ద వాగులో పారబోత

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: కృష్ణా నదిలోనూ రసాయన వ్యర్థాలను నేరుగా కలిపేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతం బుగ్గమాధారం గ్రామస్థులు మేల్కొనడంతో ఈ నిర్వాకం బట్టబయలైంది. ఈ ప్రాంత మూగజీవాల దాహార్తిని తీరుస్తూ.. కృష్ణమ్మ ఒడికి చేరే బండవాగులోనే ఈ వ్యర్థాలను కలుపుతూ పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఫార్మా సంస్థల నిర్వాకమేనని కూడా బహిర్గతమైంది. ఈ వాగు నదిలో కలిసే ప్రాంతంలో మిషన్‌ భగీరథ పథకం తాగునీటి ఇన్‌టేక్‌ వెల్‌ ఉండడం గమనార్హం. ఇదేకాదు..నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సిమెంటు కంపెనీలూ ఈ రసాయన వ్యర్థాల ట్యాంకర్లను రప్పిస్తున్నారు. ఘాటైన వాసనలతో ప్రజల మనుగడకు ముప్పు తెస్తున్నారు.

అక్కడ ఔషధం.. ఇక్కడ గరళం... పట్టణాలు, నగరాల్లోని కొన్ని ఫార్మా కంపెనీల యాజమాన్యాలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. రసాయన వ్యర్థాలను భూమ్మీద, నీటిలో కలిపేస్తున్నాయి. ఈ ప్రాంతంలో లక్షల మంది దాహార్తిని తీర్చే కృష్ణానదిలోనే కలుపుతున్నారు. పల్లె దారుల వెంట, వాగుల్లో పోస్తున్నారు. ప్రాణుల మనుగడకు ముప్పు తెస్తున్నారు. ఇటీవల హుజూర్‌నగర్‌ బైపాస్‌ రోడ్డు ఎన్నెస్పీ కాల్వ పక్కనే గోతుల్లో పోశారు. ఇక్కడి సిమెంటు కంపెనీలకు వచ్చే ట్యాంకర్లు లీకై రోడ్డుపై వ్యర్థ రసాయనం పడడంతో.. మేళ్లచెరువు, కోదాడ, చింతలపాలెం, వజినేపల్లి రోడ్లపైనా చాలా సందర్భాల్లో ఘాటు వాసనలతో జనం ఇబ్బంది ఘటనలు కొకొల్లలు. సూర్యాపేట, మోతె తదితర ప్రాంతాల్లోనూ రసాయన వ్యర్థాల పారబోత కొనసాగుతుంది.

తాగేనీటిలో రసాయనాలు... మేళ్లచెరువు, చింతలపాలెం, కోదాడలోని కొన్ని గ్రామాలతో పాటు 20 గ్రామాలకు బుగ్గమాధారం మిషన్‌ భగీరథ నీటి పథకం నుంచే తాగునీరు సరఫరా జరుగుతోంది. ఈ పథకం ఇన్‌టేక్‌ వెల్‌ను ఏర్పాటు చేసే చోటనే ఈ బండవాగు నీరు కృష్ణానదిలో కలుస్తుంది. కొన్నాళ్లుగా ఈ వ్యర్థాలను వాగులో కలుపుతున్నారంటే.. ఈ భగీరథ నీటిలోనూ ఈ విష అవశేషాలు కలిసి ఉంటాయని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. వాగు నదిలో కలకవ ముందూ ఈ ప్రాంత పాడి పశువులు, మూగజీవాల దాహార్తిని తీరుస్తుంది. ఈ రసాయన వ్యర్థాల ట్యాంకర్ల లీకులు, సిమెంటు కంపెనీల్లో వాడకం వల్ల వచ్చే ఘాటైన వాసనలతో తమకు ప్రాణ హానీ ఉందంటూ గుడిమల్కాపురం, చింతలపాలెం, మరికొన్ని గ్రామాల ప్రజలు ఓ సిమెంటు పరిశ్రమ గేటు వద్దనే ఆమధ్య నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో రైతుల నిరసనను తప్పుపట్టిన కంపెనీ జీఎంనూ చితకబాదారు. ఇంతజరిగినా ఫార్మా కంపెనీలు వ్యర్థాలను ఇటువైపు పంపడం మాత్రం ఆగడం లేదు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ అధికార యంత్రాంగం ఇటువైపు కన్నెతి చూడకపోవడం కొసమెరుపు!


బండవాగులో పారబోస్తుండగా పట్టుకున్న గ్రామస్థులు  

గ్రామస్థులు పట్టుకున్న రసాయన వ్యర్థాల ట్యాంకరు

చింతలపాలెం: రసాయన వ్యర్థాలను వాగులో కలుపుతుండగా.. ఆ ట్యాంకరును గ్రామస్థులు పట్టుకున్న ఘటన శుక్రవారం అర్థరాత్రి బుగ్గమాధారం వద్ద చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో బుగ్గమాధారం సమీపంలోని బండ వాగులో ఈ రసాయన వ్యర్థాలను కలుపుతుండగా.. ఏపీ 01 డబ్ల్యూ 5097 నంబరు గల ట్యాంకర్‌, డ్రైవరును గ్రామస్థులు పట్టుకున్నారు. డ్రైవరును విచారించారు. పోలీసులకు పట్టించారు. ఈ ట్యాంకరు ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఐనేష్‌ ఫార్మా సంస్థ యాజమాన్య ఆదేశాలతో వచ్చినట్టు డ్రైవరు పేత్లవత్‌ జయపాల్‌ తెలిపారు. రసాయన వ్యర్థాలతో తమకు నష్టం జరుగుతున్నట్లు వారి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఠాణాలో ఫిర్యాదునిచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని