logo

ఇష్టారాజ్యంగా నిధుల వినియోగం!

భువనగిరి పురపాలక సంఘంలో నిధుల వినియోగంతీరుపై పుర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం విడుతల వారీగా నిధులు, ప్రజల పన్నులతో సాధారణ నిధిలో జమవుతున్న సొమ్మును మంచినీళ్ల

Published : 26 Sep 2022 04:24 IST

నేడు పురపాలక కౌన్సిల్‌ సమావేశం

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: భువనగిరి పురపాలక సంఘంలో నిధుల వినియోగంతీరుపై పుర సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం విడుతల వారీగా నిధులు, ప్రజల పన్నులతో సాధారణ నిధిలో జమవుతున్న సొమ్మును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణ, పండుగలు, వేడుకల పేరిట నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేస్తున్నరనే ఆరోపణలు ఉన్నాయి. పురపాలికలో గత నెల చెల్లింపులను సోమవారం జరగనున్న పుర సర్వసభ్య సమావేశం ఎజెండాలో చేర్చిన అంశాలు పరిశీలిస్తే ఆ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

ఖర్చులు, ప్రతిపాదనలు ఇలా...

నిర్వహణ ఖర్చుల పేరిట అయ్యే వ్యయాన్ని ముందస్తుగా కౌన్సిల్‌ అమోదం పొంది, ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాహనాల డీజిల్‌ వినియోగంపై కొన్నేళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. వాహనాలకు నిబంధనల మేరకు లాగ్‌బుక్‌ నిర్వహించకుండానే డీజిల్‌ను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెల డీజిల్‌ పేరిట రూ.5,11,943 బిల్లు చెల్లించారు. నీటి పైప్‌లైన్‌ నిర్వహణకు గతంలో అనేక సందర్భాల్లో మరమ్మతులు చేపట్టినా గత నెలలో రూ.4,46,347 ఖర్చు చేయడం గమనార్హం. ప్రస్తుత ఎజెండాలో గ్రీన్‌ బడ్జెట్‌, సాధారణ నిధుల కింద రూ.61 లక్షలకు ఆమోదం తీసుకున్న మొత్తం నుంచి బతుకమ్మ, విజయదశమి పండుగల ఏర్పాట్ల కోసం రూ.15 లక్షలు, మెప్మా కార్యాలయం మరమ్మతులకు రూ.3లక్షలు ఆమోదానికి ప్రతిపాదించారు. రోడ్డు విస్తరణలో భాగంగా మొక్కలు నాటేందుకు మట్టికి రూ.4లక్షలు, మట్టి పర్చేందుకు రూ.2లక్షలు కూలీ కోసం, వినాయక నిమజ్జనం ఖర్చుల కోసం రూ.5లక్షలు, మొక్కలను నీరు పోసేందుకు రూ.2లక్షలు ఖర్చు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్‌ చెట్లకు సపోర్ట్‌ కర్రల కొనుగోలుకు రూ.లక్ష, ఎర్ర మట్టి పోయించేందుకు మరో రూ.లక్ష వెచ్చించారు. ట్రైసైకిళ్ల కోనుగోలుకు రూ.5లక్షలు, వాహనాల టైర్లు, ట్యూబులు మార్చేందుకు రూ.3లక్షలు, కార్మికుల బయోమెట్రిక్‌ హాజరు నమోదు పరికరాలు ఉండగానే, మరో రెండింటి కొనుగోలుకు రూ.99 వేలు, వాహనాల ఆయిల్‌ మార్పు, సర్వీసింగ్‌ కోసం రూ.5లక్షలు, ఆస్తి పన్ను, నీటి పన్ను వసూలు చేసేందుకు వినియోగిస్తున్న చేతిపరికరాల మరమ్మతులు, విడి భాగాల కొనుగోలుకు వేర్వేరుగా రూ.2లక్షలు ఆమోదానికి ఎజెండాలో చేర్చారు. కాగా, నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

నిబంధనలన్నీ పాటిస్తున్నాం: నాగిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

నిబంధల మేరకు నిధులను వినియోగిస్తున్నాం. దుర్వినియోగం కాలేేదు. నిబంధల మేరకు పనులను టెండర్ల ద్వారా చేపడ్తున్నాం. గ్రీన్‌ బడ్జెట్‌, సాధారణ బడ్జెట్‌లతో ఆయా పనులను చేపడుతున్నాం. అవసరాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని పనులు చేపడుతున్నాం.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts