logo

హరిహర ఆరాధనలు

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహర ఆరాధనలు కొనసాగాయి. సుప్రభాతంతో కైంకర్యాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానాలయంలో పంచనారసింహులను మేల్కొలిపిన పూజారులు స్వయంభువులను ఆరాధిస్తూ హారతి నివేదన జరిపారు.

Published : 06 Dec 2022 04:09 IST

ఆలయంలో పురప్పాట్‌ సేవోత్సవం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహర ఆరాధనలు కొనసాగాయి. సుప్రభాతంతో కైంకర్యాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానాలయంలో పంచనారసింహులను మేల్కొలిపిన పూజారులు స్వయంభువులను ఆరాధిస్తూ హారతి నివేదన జరిపారు. బిందెతీర్థం, బాలబోగం చేపట్టాక నిజరూపాలను పాలతో అభిషేకించారు. తులసీ దళాలతో అర్చన జరిపారు. దర్శనమూర్తులకు స్వర్ణ పుష్పార్చన జరిపి దర్శనాలకు తెరతీశారు. యాజ్ఞికులు వేదమంత్ర పఠనాలతో శ్రీ సుదర్శన నారసింహహోమం నిర్వహించగా పూజారులు విశ్వక్సేన ఆరాధనతో శ్రీ లక్ష్మీనారసింహుల నిత్యకల్యాణాన్ని చేపట్టారు. ఆలయ మహాముఖమండపంలో అష్టోత్తర పర్వాన్ని నిర్వహించారు. సాయంత్రంవేళ అలంకార జోడు సేవోత్సవాన్ని మాడవీధుల్లో నిర్వహించారు. రాత్రి స్వయంభువులకు ఆరాధన, సహస్రనామార్చన జరిపారు. దర్బారు సేవోత్సవాన్ని చేపట్టి నిత్యాదాయాన్ని వెల్లడించారు.

*  అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహేశ్వరుడిని ఆరాధిస్తూ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. బిళ్వపత్రాలతో అర్చన జరిపారు.

రాత్రివేళ సేవోత్సవం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కొనసాగుతున్న తిరుమంగై ఆళ్వారుల తిరునక్షత్రోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం పురప్పాట్‌ సేవోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ప్రబంధ పఠనాల మధ్య చేపట్టిన సేవోత్సవాన్ని ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని