logo

మూడేళ్లలో రూ. 3 వేల కోట్ల అభివృద్ధి: కేటీఆర్‌

హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మేళ్లచెరువులో ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా జరిగే ఎడ్ల పందేలను చూడటానికి తప్పకుండా వస్తానని, ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించేలా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Published : 07 Jan 2023 04:47 IST

సభలో మాట్లాడుతున్న కేటీఆర్‌. వేదికపై ప్రజాప్రతినిధులు

* హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మేళ్లచెరువులో ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా జరిగే ఎడ్ల పందేలను చూడటానికి తప్పకుండా వస్తానని, ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించేలా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. జాన్‌పహడ్‌ దర్గాను షాద్‌నగర్‌లోని జేపీ దర్గాగా మాదిరిగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. 

* మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 11.39 గంటలకు హుజూర్‌నగర్‌ చేరుకున్న ఆయన అక్కడ పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం చండూరుకు చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటూ గట్టుప్పల్‌, చండూరులో పర్యటించిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. నల్గొండ, సూర్యాపేట ఎస్పీలు రెమారాజేశ్వరి, రాజేంద్రప్రసాద్‌ బందోబస్తు బాధ్యతలు చూశారు.

ఎంపీ ఉత్తమ్‌ని పలకరిస్తున్న మంత్రి కేటీఆర్‌

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే హుజూర్‌నగర్‌ గ్రామీణం, మునుగోడు, చండూరు: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో గత మూడేళ్లలో రూ.3 వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నాలుగైదు నెలల్లో చండూరు పురపాలికలో సుందరీకరణ పనులు పూర్తి చేసి అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. పనిచేసే నాయకులు కోరుకునేది అభివృద్ధి ఒక్కటేనని, ఆ దిశగా ప్రజలు అశీర్వదిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూసే విధంగా సీఎం కేసీఆర్‌ తమకు దిశా నిర్దేశం చేస్తారని, ఆ దిశగా ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. హుజూర్‌నగర్‌, చండూరు పురపాలికల్లో రూ.250 కోట్లతో చేపట్టే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటూ గట్టుప్పల్‌లో చేనేత క్లస్టర్‌లకు మంత్రి కేటీఆర్‌ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన హుజూర్‌నగర్‌, గట్టుప్పల్‌, చండూరులో మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్‌, రవీందర్‌కుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరీ, అదనపు కలెక్టర్లు కుష్బుగుప్తా, భాస్కర్‌రావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ చంద్రకళ, మున్సిపల్‌ కమిషనర్‌ మణికరన్‌, ఎంపీపీ పల్లెకల్యాణి తదితరులు ఉన్నారు.

హుజూర్‌నగర్‌: నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వంతెనలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేటీఆర్‌, తదితరులు

హుజూర్‌నగర్‌, గట్టుప్పల్‌, చండూరులో మంత్రి కేటీఆర్‌ చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు హుజూర్‌నగర్‌లో ప్రారంభోత్సవాలు

* రూ.30 కోట్లతో రామస్వామి గుట్ట వద్ద ఇప్పటికే నిర్మించిన ఒక పడకగది ఇళ్ల మరమ్మతు నిర్మాణ పనులు
* ఈఎస్‌ఐ ఆసుపత్రి, సబ్‌ ట్రెజరీ కార్యాలయం  
* రూ. కోటితో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

శంకుస్థాపనలు

* రూ.20 కోట్లతో కీతవారిగూడెం నుంచి మునగాల వరకు నిర్మించనున్న రహదారి
* రూ.5.3 కోట్లతో లింగగిరి రోడ్డు నుంచి మఠంపల్లి బైపాస్‌ వరకు సెంట్రల్‌లైటింగ్‌
* రూ.6 కోట్లతో హుజూర్‌నగర్‌ చుట్టూ వలయ రహదారి( రింగ్‌రోడ్డు)
* రూ. 10 కోట్లతో నేరేడుచర్ల పురపాలికలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులు
* రూ.26 లక్షలతో మాధవరాయినిగూడెం, ముగ్దుంనగర్‌లో బస్తీ దవాఖానాల నిర్మాణం
* రూ.13 లక్షలతో నేరేడుచర్ల మున్సిపాల్టీలో బస్తీ దవాఖానా
* రూ.19.35 కోట్లతో సాగర్‌ ఎడమ కాల్వపై గరిడేపల్లి మండలం మర్రికుంట వద్ద వంతెన
* రూ.13.63 కోట్లతో సాగర్‌ ఎడమ కాల్వపై కుతుబ్‌షాపురం వద్ద వంతెన
* రూ.18 లక్షలతో హుజూర్‌నగర్‌ మండలంలోని రాంపురం మేజర్‌ వద్ద నాగార్జునసాగర్‌ కాల్వపై వంతెన
* రూ. 49.10 లక్షలతో కరక్కాయలగూడెం వద్ద ఎంబీ కెనాల్‌పై వంతెన నిర్మాణం

గట్టుప్పల్‌లో శంకుస్థాపన

* 8.91 కోట్లతో గట్టుప్పల్‌, తేరట్‌పల్లి రెండు చేనేత సమూహాలకు భూమిపూజ

చండూరులో శంకుస్థాపనలు

* రూ.30 కోట్లతో చండూరు పట్టణంలోలో రెండు వరుసల ప్రధాన రహదారి నిర్మాణం
* రూ.5.5 కోట్లతో పట్టణంలో సీసీ రహదారులు, మురుగుకాల్వలు
* రూ.2 కోట్లతో సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం
* రూ.50 లక్షలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌
* రూ.2 కోట్లతో నూతన పురపాలిక భవనం
* రూ.95 కోట్లతో గట్టుప్పల్‌ నుంచి కొండమల్లేపల్లి వరకు గల రహదారి అభివృద్ధికి హామీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని