logo

చదువుల బాటలో.. సమాజ సేవలో..!

పాఠశాల స్థాయి నుంచే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకున్నారు. డిగ్రీకి వచ్చినా మరవకుండా కొనసాగిస్తున్నారు సూర్యాపేటలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(టీటీడబ్ల్యూఆర్‌డీసీ) విద్యార్థినులు.

Updated : 31 Mar 2023 06:12 IST

ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న విద్యార్థినులు

ఆమనగల్లులో మురుగు కాల్వను శుభ్రం చేస్తున్న టీటీడబ్ల్యూఆర్డీసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

భానుపురి, సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: పాఠశాల స్థాయి నుంచే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకున్నారు. డిగ్రీకి వచ్చినా మరవకుండా కొనసాగిస్తున్నారు సూర్యాపేటలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(టీటీడబ్ల్యూఆర్‌డీసీ) విద్యార్థినులు. ఎన్‌ఎస్‌ఎస్‌(జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థినులు వాలంటీర్లుగా ఏర్పడి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25 నుంచి 31 వరకు వేములపల్లి మండలం ఆమనగల్లులో 50 మంది విద్యార్థులు ఏడు బృందాలుగా ఏర్పడి శిబిరం నిర్వహిస్తున్నారు. శ్రమదానం, అవగాహన, వైద్య శిబిరాలు, పరిశుభ్రత, పచ్చదనం, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ప్రదర్శిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ సుక్క సునీలా, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమ నిర్వహణ అధికారి రమ్య ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి గ్రామస్థులను చైతన్యపరుస్తున్నారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉదయం, శ్రమదానం, అవగాహన ర్యాలీలు చేపడుతున్నారు. రాత్రి నాటికలు, నృత్యాల ద్వారా గ్రామంలోని ప్రజలను అవగాహన పరుస్తున్నారు. ఎంజడ్సీ, బీజడ్సీ విద్యార్థులు గ్రామస్థులకు బీపీ, మధుమేహం, రక్త పరీక్షలు చేసి పలు సూచనలు ఇస్తున్నారు. గ్రామాల్లోని మురుగు కాల్వలు, రోడ్ల వెంట చెత్తను శుభ్రం చేసి గ్రామస్థులను అవగాహన పరుస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతపై వివరించి చైనత్యపరుస్తున్నారు.


మూఢనమ్మకాలపై అవగాహన
- మంజూల, ఎంజెడ్‌సీ మూడో సంవత్సరం

ఆమనగల్లులో మురుగు కాల్వలు, రోడ్లను శుభ్రం చేసి గ్రామస్థులను పరిసరాలపై పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్ల మధ్య నీరు నిల్వకుండా, చెత్తాచెదారాన్ని తీసి శుభ్రం చేస్తున్నాం. ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా సేవా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. అపరిశుభ్రత వల్ల కలిగే అనర్థాలపై ప్రజలుకు వివరిస్తున్నాం. ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నాం.


సంతోషంగా ఉంది..
- శిరీష, బీజెడ్‌సీ రెండో సంవత్సరం

ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం ద్వారా గ్రామస్థులకు వైద్యపరీక్షలు చేయడం సంతోషంగా ఉంది. ప్రజలకు రక్తపోటు, మధుమేహం, తదితర పరీక్షలు చేసి వ్యాధుల వల్ల కలిగే ముప్పు గురించి వివరించాం. భవిష్యత్తులో వాటి నివారణకు తీసుకోవాల్సిన సూచనలు, సలహాలు చేశాం. ఏడురోజులపాటు ప్రత్యేక శిబిరం కొనసాగుతుంది. గ్రామస్థులు ముందుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని