logo

స్వల్ప తేడాతో దామోదర్‌రెడ్డి మరోసారి ఓటమి

సూర్యాపేటలో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతిలో ఆయన  4,605 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Published : 04 Dec 2023 04:51 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: సూర్యాపేటలో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతిలో ఆయన  4,605 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లోనే దామోదర్‌రెడ్డిపై జగదీశ్‌రెడ్డి కేవలం 5,967 ఓట్ల స్వల్ప తేడాతోనే గెలుపొందారు. తనకు ఇదే చివరి ఎన్నిక అని ప్రచారం చేసుకున్నప్పటికీ.. ఫలితం లభించలేదు. దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం చివరి వరకు టికెట్‌ కేటాయించడంలో జాప్యంతో పాటు అక్కడి నుంచి టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేశ్‌రెడ్డి సైతం నామినేషన్‌ వేసి.. అనంతరం పార్టీ పెద్దల సూచనలతో విరమించుకున్నారు. మొదటి నుంచి ఇద్దరు కలిసి వెళ్తే సులభంగా గెలుపుతీరాలకు వెళ్లేవారని పలువురు అంచనా వేస్తున్నారు. మరో వైపు మంత్రి జగదీశ్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ వద్ద తనకున్న చొరవతో సూర్యాపేటను జిల్లా చేయడంతో పాటు అనేక అభివృద్ధి పథకాలు ఆయనకు కలిసి వచ్చాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీచినప్పటికీ తట్టుకుని.. ఒక్కరే నెగ్గి చూపించారు.


పోటీలో ప్రత్యర్థులు.. గెలుపులో స్ఫూర్తిప్రదాతలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తుది వరకు ఉత్కంఠగా సాగింది. చివరికి భారాస అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్యే విజేత జగదీశ్‌రెడ్డిని, పరాజయం పొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డి ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.

ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని