logo

విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్‌

మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 03 May 2024 02:03 IST

మునగాల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిత్రంలో అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, తదితరులు

నడిగూడెం, మోతె, మునగాల, న్యూస్‌టుడే: మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నడిగూడెం, మోతె, మునగాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. నడిగూడెం మండలంలో ఉన్న అన్ని లిఫ్ట్‌ ఇరిగేషన్లకు మరమ్మతులు చేయించి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. మోదీ మరోసారి ప్రధాని అయితే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని మోదీ, అమిత్‌షాకు ఇక్కడ తిరిగే అర్హతలేదన్నారు. సీపీఎం, మిత్రపక్షాల సహకారంతో తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని పాలించాలని కలలు గన్న కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఇంటికే పరిమితం చేశారని, అలాగే మోదీని గద్దెదించాలన్నారు. దేశసంపదను కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టి, నిరుద్యోగులను మోసం చేసిన భాజాపాను ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, శంకర్‌ నాయక్‌, పీసీసీ కార్యదర్శి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కోదాడ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధే కనిపిస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి రంగా థియేటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నల్గొండ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ గెలుపుతోనే సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని