logo

ఇంటి వద్దే ఓటు..!

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు.

Published : 03 May 2024 02:14 IST

లోక్‌సభ ఎన్నికల్లో ఇదే మొదటి సారి

ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్న మాస్టర్‌ శిక్షకులు (పాత చిత్రం)

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని స్థితిలో ఉండే వృద్ధులు, 40 శాతం పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో ఇదే మొదటి సారి. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగానికి ఫారం- 12డీ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 22 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 3 నుంచి తమ ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 4, 5 తేదీల్లో ఒక విడత, ఈ విడతలో ఓటు హక్కు వినియోగించుకోలేని వారికి ఈ నెల 8న మరోసారి అవకాశం కల్పించనున్నారు.

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో 43,326 మంది ఓటర్లు..

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అర్హత కలిగిన వారు మొత్తం 43,326 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,992 మంది, మహిళలు 20,330 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 33,839 మంది ఉండగా.. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,487 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఇంటి వద్ద ఓటు వినియోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇంటి వద్ద ఓటు హక్కుకు అవకాశం కల్పించనున్నారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 240 మంది, కోదాడ నియోజకవర్గంలో 158 మంది, సూర్యాపేటలో 171 మంది, తుంగతుర్తిలో 152 మంది ఇంటి నుంచి ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 363 మంది దరఖాస్తు చేసుకున్నారు.


ఓటు వేయించేందుకు ప్రత్యేక బృందాలు..

ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు వేయించేందుకు ప్రతి 45 మంది ఓటర్లకు (సుమారు) ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో పీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్‌, వీడియో గ్రాఫర్‌, రూట్‌ అధికారి, సెక్టార్‌ అధికారితో కలిపి మొత్తం ఆరుగురు చొప్పున సభ్యులు ఉంటారు. వీరు తమకు కేటాయించిన తేదీల్లో ఆయా సెక్టార్ల పరిధిలోని ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓటు వేయిస్తారు. ఓటు వేయడం కోసం ఓటరు వద్ద ఫారం 13ఏ(గులాబీ రంగు కవర్‌) అటెస్టేషన్‌ కోసం, ఫారం 13బీ బ్యాలెట్‌ పేపర్‌(నీలం రంగు కవర్‌)లో వివరాలు పూర్తి చేసి కవర్లపైన బ్యాలెట్‌ పేపర్‌ క్రమ సంఖ్య రాసి కవర్‌ సీ(పసుపు రంగు)లో పెట్టి సీల్‌ చేసి బ్యాలెట్‌ పెట్టెలో వేయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని