logo

చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!

కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి.

Published : 28 Mar 2024 05:14 IST

హుజూర్‌నగర్‌: ముక్త్యాల బ్రాంచి కాలువలో కంపచెట్లను తొలగిస్తున్న గుత్తేదారులు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. 29 కిలోమీటర్ల పొడవు ఉన్న బ్రాంచి కాలువ, దాని పరిధిలోని మేజర్లను, కొన్ని మైనర్ల కాలువలను కూడా లైనింగ్‌, కాలువల పటిష్ఠం చేసేందుకు రూ.184 కోట్లు మంజూరు అయ్యాయి. దీంతో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరనున్నాయి. ఈ ఆధునికీకరణ పనులు పూర్తి చేయడం వల్ల కాలువ చివరి వరకు సాగునీరు సజావుగా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.

వీటిని ఆధునికీకరణ చేస్తారు..

ముక్త్యాల బ్రాంచి కాలువ మొత్తం దాదాపు 29 కిలోమీటర్లు ఆధునికీకరణ చేస్తారు. ఆధునీకరణ కింద కాలువ కట్టలు, కాలువ అడుగు భాగం సిమెంటుతో లైనింగ్‌ చేస్తారు. కాలువ వెంట ఉన్న యూటీలు, తూములు బాగు చేస్తారు. పూర్తి స్థాయిలో కాలువ లైనింగ్‌ చేయడం వల్ల ఇక సాగు నీరు వృథా అనేది లేకుండా ప్రతి నీటి బొట్టు సాగునీరుగా ఉపయోగపడుతుంది. బ్రాంచి కాలువ మాత్రమే కాకుండా చింత్రియాల, గుండ్లపల్లి, మఠంపల్లి, లింగగిరి మేజర్లు కూడా ఆధునికీకరణ చేస్తారు. లింగగిరి మేజర్‌ 8 కిలోమీటర్లు, మఠంపల్లి మేజరు 5.9 కిలోమీటర్లు, గుండ్లపల్లి మేజర్‌ 7.3 కిలోమీటర్లు, చింత్రియాల మేజర్‌ 10.5 కిలోమీటర్లు కాలువలను ఆధునికీకరణ చేస్తారు. మఠంపల్లి మేజర్‌ పరిధిలోని ఐదు మైనర్ల కాలువలు, చింత్రియాల మేజర్‌ కింద 4 మైనర్ల కాలువలు కూడా ఆధునికీకరణలో ఉన్నాయి. ఇప్పటికే గుత్తేదారులు ముక్త్యాల బ్రాంచి కాలువ లైనింగ్‌, కాలువ కట్టలను పటిష్ఠం చేసేందుకు కాలువ కట్టమీద ఉన్న కంపచెట్ల తొలగింపు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది.


రైతుల ఇబ్బందులు తొలగాలని..

ముక్త్యాల బ్రాంచి కాలువ పరిధిలో దాదాపు 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. అందులో 40శాతం ఆయకట్టుకు సక్రమంగా నీరు అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి పంటల సమయంలో రైతులు కాలువల మీద కాపలా కాసి మరీ కాలువ కిందికి నీరు తీసుకు వెళ్లే పరిస్థితి ఉండేది. క్రమంగా రైతులు ప్రత్యామ్నాయంగా బోర్లు, బావులు ఏర్పాటు చేసుకున్నా నేటికీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ కాలువకు లైనింగ్‌ పనులు చేసి సాగునీటి వృథాను అరికట్టి రైతుల ఇబ్బందులు తొలగించేందుకు గత సంవత్సరం లైనింగ్‌ పనులను మంజూరు చేశారు. మూడు, నాలుగు కిలోమీటర్ల మేర పనులు కూడా జరిగాయి. తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనులు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని