logo

మాటల్లేవు.. మీటలే..!

పట్టణాలు.. పల్లెల్లోనూ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ లేని విద్యార్థులు అరుదు. భద్రత కోసమో లేదా ఇంట్లో పోరు పెడుతున్నారనో తల్లిదండ్రులు చరవాణి కొనిపెడుతున్నారు.

Updated : 16 Apr 2024 05:56 IST

ఏడో తరగతి వరకు అంతా కలిసే చదువుకున్నారు. ఆ తర్వాత ఇంజినీరింగ్‌ వరకు వేర్వేరు కళాశాలలు. తమ స్నేహాన్ని పునరుద్ధరించుకోవడానికి అంతా కలిసి సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకున్నారు. కానీ ఇద్దరు యువతీ, యువకుల మధ్య చనువు పెరిగింది. స్నేహితుడిని నమ్మి యువతి తన ఫొటోలను యువకుడికి పంపింది. ప్రేమ పేరిట మోసగించిన అతడు కొన్నాళ్లకు ఇష్టం లేదని చెప్పాడు. దిక్కుతోచక ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను మానసిక నిపుణుల వద్దకు తీసుకురావడంతో మామూలు మనిషిగా మారింది.


ఇంటర్‌ చదువున్న విద్యార్థినికి తండ్రి స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చాడు. ఫేస్‌బుక్‌ ద్వారా తెలియని వ్యక్తితో స్నేహం మొదలైంది. ఆ ఆకర్షణ కాస్తా ప్రేమగా మారింది. మాయమాటలు నమ్మి వ్యక్తిగత ఫొటోలనూ పంచుకుంది. చివరకు అతడి నిజస్వరూపం బయటపడింది. డబ్బులు ఇవ్వకుంటే అంతర్జాలంలో పెడతానని బెదిరిస్తుండటంతో అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పి విలపించింది.


నాంపల్లి, న్యూస్‌టుడే: పట్టణాలు.. పల్లెల్లోనూ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ లేని విద్యార్థులు అరుదు. భద్రత కోసమో లేదా ఇంట్లో పోరు పెడుతున్నారనో తల్లిదండ్రులు చరవాణి కొనిపెడుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రతి రోజు తమ స్నేహితులతో మాట్లాడుకునేందుకు ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నారు. ఉపయుక్త సమాచారం వరకు ఫర్వాలేదు కానీ అదే వ్యాపకమైతే ఆ ప్రభావం చదువు, తీసుకునే ఆహారం, వివిధ పనులు, కుటుంబ సంబంధాలపై సైతం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫేస్‌ బుక్‌, వాట్సప్‌, స్నాప్‌ చాట్, షేర్‌చాట్లకు అతుక్కుపోవడం, రీల్స్‌ చూస్తూ.. చేసేయడం కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల్లో మరింత ఎక్కువగా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులు మాట్లాడే సమయంలోనూ వీరు చరవాణిని వదిలిపెట్టడం లేదు కదా.. అవతలి వారి మాటలకు స్పందించడం మానేస్తున్నారు. ఇది విన్నావా అంటే.. ఏదీ.. అని తిరిగి ప్రశ్నించేంతగా అందులో లీనమైపోతున్నారు.

స్వీయ ప్రేరణ మేలు..

చరవాణి మాయా ప్రపంచంలో విహరిస్తున్న వారిలో సీˆ్వయ ప్రేరణ ద్వారానే మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. ‘నేను ఫోన్‌ ఎందుకు వాడుతున్నాను..? వాట్సాప్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఈ సందేశాన్ని ఎందుకు పెడుతున్నాను..? దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా..? ఈ యాప్‌ను నిత్య వాడటం వల్ల మానసికంగా ఏదైనా సంతోషం కలుగుతుందా..? లేదా వ్యతిరేక ప్రభావం నాపై పడుతుందా..?’ అనే ప్రశ్నలు వారికి వారు వేసుకోవాలి. తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తన మారుతుంది. అంతేకాకుండా అనవసర స్నేహాల జోలికి వెళ్లకుండా తమను తాము నియంత్రించుకుంటారు.

విలువల విత్తనాలు నాటాలి..

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నారంటే కంగారు పడిపోతుంటారు. అభద్రతా భావంతో నానా హడావిడి చేస్తుంటారు. వారి నుంచి చరవాణి లాక్కోవడమో.. అంతర్జాల కనెక్షన్‌ తీసివేయించడమో చేస్తుంటారు. పిల్లలను మంచిదారిలో నడిపించడంలో పెద్దల పాత్ర చాలా ఉంటుంది. ఒక్కసారిగా వారిని మార్చేయాలని కఠిన నిబంధనలు విధించకుండా నెమ్మదిగా మంచి మార్గంలోకి తీసుకురావాలి. వారిలో విలువల విత్తనాలను నాటాలి. ఫోన్ల విషయమనే కాకుండా పిల్లలు చేసే ప్రతి పని విలువలతో కూడి ఉంటుందా లేదా అనే విషయాలను గమనిస్తూ ఉండాలి.


కొంగొత్త హంగులతో ‘యాప్‌’లు..

సాంకేతికంగా నేడు వస్తున్న మార్పుల గురించి చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. అనేక రకాల యాప్‌లు కొంగొత్త హంగులతో పలకరిస్తున్నాయి. పిల్లలు అంతర్జాలంలో ఏ యాప్‌లు వినియోగిస్తున్నదీ, తరచూ ఏం చేస్తున్నదీ, ఏయే పోస్టింగులు పెడుతున్నారనేది కాస్త దృష్టి పెట్టాలి. తద్వారా వారి మానసిక స్థాయి ఎలా ఉందనేది తెలుస్తుంటుంది. ప్రశ్నించే వారికి పిల్లలు ఆమడ దూరంలో ఉంటారు. భయపెడితే మారుతారనుకోవడం పొరపాటే. ‘ అలా చేయకూడదు. నీకు ఇబ్బందులు వస్తాయి..? మరోసారి ఇలా చేశావో’ అంటూ హెచ్చరిస్తూ పోతే వారు ఆ చర్యలను మానకపోగా రహస్యంగా చేస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని