logo

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డే సరైనోడు: రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్‌సభ ఇన్‌ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

Updated : 19 Apr 2024 06:32 IST

మునుగోడు వేదికగా ఐక్యత చాటుతున్న ఎమ్మెల్యేలు, చిత్రంలో భువనగిరి లోక్‌సభ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి
మునుగోడు, న్యూస్‌టుడే: తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్‌సభ ఇన్‌ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు సరైన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డేనని వ్యాఖ్యానించారు. మునుగోడు మండల కేంద్రంలో గురువారం జరిగిన భువనగిరి లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస మంచి పాలన అందిస్తే జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గేట్లు తెరిస్తే భారాస ఎమ్మెల్యేలంతా వరుస కడుతారని.. ఆ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులే మిగిలిపోతారన్నారు. ఈ ఎన్నికల్లో భాజపా పోటీలోనే లేదని.. భారాస పని అయిపోయిందని.. కాంగ్రెస్‌ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కోమటిరెడ్డి సోదరుల అడుగు జాడల్లో నడిచి ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానన్నారు. తనను ఎంపీగా గెలిపించి ఆశీర్వాదించాలన్నారు. ఏపూరి సోమన్న ఆట పాట అలరించింది. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, నకిరేకల్‌, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్‌నేత, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షులు చెవిటి వెంకన్న, ఆడెం సంజీవ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని