logo

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్‌

జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌ రాజు తెలిపారు.

Published : 20 Apr 2024 04:41 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌ రాజు తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ ప్రాంతానికి చెందిన దేవరకొండ రాంబాబు(55) జల్సాలకు అలవాటు పడి గత కొంత కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న మిర్యాలగూడ వన్‌టౌన్‌ ప్రాంతంలో మౌర చంద్రశేఖర్‌ ఇంట్లో రూ.50 వేలు ఎత్తుకెళ్లినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈదులగూడ వద్ద శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న రాంబాబును అదుపులోకి తీసుకుని విచారించగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి నుంచి 20తులాల బంగారం వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ జి.సుధాకర్‌, ఎస్సై ఎం.రవి కుమార్‌, ఏఎస్సై శివ, తదితరులు పాల్గొన్నారు.


అడవి పందులను తప్పించబోయి తాటి చెట్టును ఢీకొట్టిన కారు

ప్రమాదంలో రామన్నపేట హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

తిప్పర్తి, న్యూస్‌టుడే: నల్గొండ-నకిరేకల్‌ రహదారిలో తిప్పర్తి మండలం పెద్దసూరారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ గుంటి జ్ఞానసుందర్‌రావు(57) శుక్రవారం మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండలోని శాంతినగర్‌కు చెందిన గుంటి జ్ఞానసుందర్‌రావు  రాజమండ్రిలో బంధువు మృతిచెందడంతో అంత్యక్రియల కోసం ఈ నెల 17న రాత్రి తన కుమారుడు శ్రీకాంత్‌, కుటుంబ స్నేహితులైన గణేష్‌ తంగరాజు, బొడ్డు జీవన్‌కుమార్‌లతో కలిసి నల్గొండ నుంచి కారులో బయలుదేరారు. అక్కడ అంత్యక్రియల్లో పాల్గొని ఈ నెల 18న సాయంత్రం నల్గొండకు తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున తిప్పర్తి మండలంలోని పెద్దసూరారం శివారులోకి రాగానే అడవి పందులు రోడ్డుకు అడ్డంగా రావడంతో వాటిని తప్పించబోయి ప్రక్కన ఉన్న తాటిచెట్టుకు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు సీటులో కూర్చున్న గుంటి జ్ఞానసుందర్‌రావు అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న తన కుమారుడు శ్రీకాంత్‌కు, మిగిలినవాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి, ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.


వృద్ధురాలిని హత్యచేసిన వ్యక్తికి జీవిత ఖైదు, జరిమానా

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: డబ్బు కోసం హత్యకు పాల్పడ్డ మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన దైద మహేందర్‌(20)పై నేర నిరూపణ కావటంతో జీవిత ఖైదు విధిస్తూ సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం కేసు వివరాలు... నామవరం గ్రామానికి చెందిన ఆకారపు ముత్తమ్మ(80), ఆకారపు జానమ్మ(65) తల్లీకూతుళ్లు వ్యవసాయం చేసి జీవించేవారు. 2018లో వ్యవసాయ పనులకు ఎడ్లు కొనేందుకు అదే గ్రామానికి చెందిన గుంటి పూలమ్మ వద్ద రూ.30 వేలు అప్పుగా తీసుకున్నారు. నిందితుడు మహేందర్‌ అది గమనించి వృద్ధుల అశక్తతను ఆసరాగా తీసుకొని డబ్బు ఇవ్వమని బెదిరించేవాడు. ఈ క్రమంలో 2018 ఆగస్టు 5న జానమ్మ చందుపట్లకు బంధువుల ఇంటికి వెళ్లింది. వృద్ధురాలు ముత్తమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గమనించిన నిందితుడు ఆమె ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వమని బెదిరించాడు. ఇవ్వకపోవడంతో వృద్ధురాలి గొంతు నులిమి హత్యచేసి ఆమె వద్ద ఉన్న చిన్న సంచిలోంచి రూ.12,600 తీసుకున్నాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన మృతురాలి కూతురు జానమ్మను చూసి నిందితుడు పారిపోయాడు. జానమ్మ ఫిర్యాదుపై మోతె పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి గ్రామీణ సీఐ శివశంకర్‌ నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు. 12 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితుడిపై నేరాల్ని నిర్ధారించింది. హత్యకు పాల్పడ్డందుకు జీవిత ఖైదు, రూ.5వేల జరిమానా, దొంగతనం నేరానికి గాను ఏడాది జైలుశిక్ష, రూ.500 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పి.పి కొంపెల్లి లింగయ్య కేసు వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు