logo

ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..

దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి.

Published : 24 Apr 2024 02:29 IST

నేడు ‘ఆహార వ్యర్థాలను ఆపు దినోత్సవం’

దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనూ నిత్యం అనేక శుభ కార్యాల్లో ఎంతో ఆహారం వృథాగా పోతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి వంటి పట్టణాల్లో ఎంతో మంది అభాగ్యులు, నిరాశ్రయులు ఆహారం కోసం బస్టాండ్లు, రోడ్ల వెంట అలమటిస్తున్నారు. నేడు ‘ఆహార వ్యర్థాలను ఆపు దినోత్సవం’ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అభాగ్యులకు అన్నదానాలు, శుభకార్యాల్లో మిగిలిన పదార్థాలను సేకరించి నిరాశ్రయులకు పంపిణీ చేసే యువతపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే:

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ..

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ రోడ్ల వెంట నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు చౌటుప్పల్‌కు చెందిన బోదుల మురళి. తన స్నేహితులు, ఇతర ఔత్సాహికుల పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా వారందించే సహాయంతో అనేక మందికి అన్నదానాలు చేస్తున్నాడు. ఈ విధంగా గత రెండేళ్లలో 844 కార్యక్రమాల ద్వారా సుమారు 42,200 మందికి ఆకలి తీర్చి, వారి హృదయాల్లో అన్నదాతగా నిలిచాడు.


పేదలకు అన్నదానాలు..

నల్గొండలోని అనాథాశ్రమంలో అన్నదానం చేస్తున్న ఆపద్భాందవ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు

గత ఆరేళ్లుగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నల్గొండకు చెందిన ఆపద్భాందవ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు పంజాల శశికుమార్‌, గణేష్‌ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. అనాథాశ్రమాలతో పాటు లెప్రసీ కాలనీ, బస్టాండ్లలో నిరాశ్రయులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.


ఆరేళ్లుగా..

శుభ, అశుభ కార్యాల్లో మిగిలిన ఆహారాన్ని పడేయకుండా వాటిని సేకరించి.. బస్టాండ్లు, రోడ్డు వెంట ఉండే అభాగ్యులు, నిరాశ్రయులకు పంచి పెడుతున్నారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆకుల కృష్ణంరాజు. మొబైల్‌ ఫోన్‌ సర్వీసింగ్‌ దుకాణం నడిపే అతను, పలు కార్యక్రమాల్లో ఎంతో ఆహారాన్ని వృథాగా పడేయడం చూసి చలించారు. గత ఆరేళ్లుగా తన స్నేహితులతో కలిసి, మిగిలిన ఆహారం అందించాలంటూ నిత్యం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. వాటిని చూసిన వారు ఆహారం ఉంటే అతడికి ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ఆటోలో వాటిని సేకరిస్తూ, రోడ్ల వెంట అభాగ్యులకు పంచిపెడుతూ వారి ఆకలి తీరుస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని