logo

ముగిసిన నామినేషన్ల పర్వం

లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్‌సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్‌లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 26 Apr 2024 04:35 IST

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి: లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్‌సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్‌లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆఖరిరోజు గురువారం కొత్తగా ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్‌లను  రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) దాసరి హరిచందనకు అందజేశారు. భారాస తరఫున మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రెండు సెట్‌ల నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్‌ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, భారాస నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భాజపా నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ ఈ ముగ్గురి మధ్యే ఉండనుండగా...ఈ దఫా స్వతంత్రులు, చిన్న పార్టీల నుంచి భారీగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు నేటి నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది.  

  • భువనగిరి లోక్‌సభ స్థానానికి బుధవారం వరకు 45 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయగా.. చివరి రోజు గురువారం కొత్తగా 16 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) హనుమంతు కే.జెండగేకు అందజేశారు. దీంతో మొత్తంగా నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సంఖ్య 61కి చేరింది. చివరి రోజు గురువారం కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్‌ ప్రమోద్‌, మాజీ పురపాలిక ఛైర్మన్‌ జహంగీర్‌ తదితరులు మరో సెట్‌ నామినేషన్‌ సమర్పించారు. ఇక్కడి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), క్యామ మల్లేష్‌ (భారాస), బూర నర్సయ్యగౌడ్‌ (భాజపా), ఎండీ జహంగీర్‌(సీపీఎం) బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ వీరి మధ్యే ఉండనుండగా...స్వతంత్రులు, రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులు సైతం భారీ సంఖ్యలో నామపత్రాలను సమర్పించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని