logo

సర్కారు బడి.. గురుకుల ఒడి

ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది.

Published : 30 Apr 2024 05:10 IST

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. ఇప్పటి వరకు 109 మంది వివిధ పాఠశాలల్లో సీటు సాధించారు. ఐదో తరగతిలో ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షల్లోనూ ఈ బడిలోని 18 మంది విద్యార్థులు ప్రతిభ చూపి వివిధ గురుకులాలకు ఎంపికయ్యారు. సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయులు నిబద్ధతతో, సమష్టి కృషితో పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులను పోటీ పరీక్షలు, రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీల్లో ముందుంచుతూ జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా నాలుగో తరగతి చదివే విద్యార్థులకు ప్రణాళికలతో పాఠాలు బోధించి గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష రాయిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం, ఉపాధ్యాయులు నాగలక్ష్మి, సంతోష్‌కుమార్‌, వనజ, ప్రభాకర్‌, యాదగిరి పాఠ్యాంశాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. రోజువారీగా పరీక్షలు నిర్వహిస్తూ వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు వాట్సాప్‌ ద్వారా విద్యార్థుల ప్రగతిని సమాచారం రూపంలో చేరవేస్తున్నారు.


సంతోషంగా ఉంది
-డి.గీతాంజలి, నాలుగో తరగతి

చివ్వెంల గురుకుల పాఠశాలలో సీటు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు మాకు సరైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ అన్ని పాఠాలు చదివేలా ప్రోత్సహిస్తున్నారు.


ప్రణాళికబద్ధంగా చదివించారు
-కె.సాహితి, నాలుగో తరగతి
ప్రణాళికా ప్రకారం మమ్మల్నీ ఉపాధ్యాయులు చదివించడం వల్ల నాకు తుంగతుర్తి గురుకులంలో సీటు వచ్చింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరువలేనిది. సీటు సాధించిన స్ఫూర్తితో పైతరగతుల్లో ఇంకా బాగా చదువుతాను.


ఆత్మకూర్‌(ఎస్‌) గురుకులంలో సీటు సాధించా
-ఎ.లక్ష్మీరామ్‌, నాలుగో తరగతి
ఆత్మకూర్‌(ఎస్‌) గురుకుల పాఠశాలలో సీటు వచ్చినందుకు సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే సీటు సాధించగలిగాను. ప్రణాళికతో పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని