logo

కారు.. కసరత్తు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో  సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది.

Published : 30 Apr 2024 05:29 IST

రెండు లోక్‌సభ స్థానాల్లో సత్తా చాటేలా భారాస వ్యూహం
ఇతర పార్టీల్లోకి వలసలతో ఉద్యమ పార్టీకి ఇబ్బందులు

ఈనాడు, నల్గొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో  సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. ఇప్పటి వరకు తమ చేతికి చిక్కని నల్గొండ స్థానంలో పాగా వేయడం, గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో కోల్పోయిన భువనగిరిలోనూ విజయం సాధించేలా క్షేత్రస్థాయి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాపైనే ఎక్కువ దృష్టి సారించడంతో ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు ఉంటాయని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 13న తొలిసారిగా నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణా జలాల పరిరక్షణ సభ పేరుతో భారాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. అనంతరం పొలంబాట పేరుతో గత నెల చివరిలో సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండిన పొలాలను కేసీఆర్‌ సందర్శించి రైతులను పరామర్శించారు. తాజాగా నిర్వహిస్తున్న బస్సుయాత్రను సైతం ఉమ్మడి జిల్లాలోని మిర్యాలగూడ నుంచే ప్రారంభించారు. రెండు రోజుల పాటూ మూడు ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిని బట్టి ఉమ్మడి జిల్లాపై భారాస ఎంతగా దృష్టిసారించిందో తెలుసుకోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  • మరోవైపు అభ్యర్థుల ప్రకటనలో కొంత జాప్యం నెలకొన్నా చివరకు భువనగిరిలో అత్యధిక ఓట్లున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్‌ను, నల్గొండలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభావం చూపే సామాజికవర్గానికి చెందిన కంచర్ల కృష్ణారెడ్డిని బరిలో దింపారు. రెండు స్థానాల్లోనూ ముఖ్య నాయకుల సమన్వయం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల ప్రచారం తదితర అంశాలను మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఈ దఫా భారాసకు మద్దతివ్వాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రచారం, రోడ్‌షోలు ముగియడంతో రెండు స్థానాల్లోని పలు కీలక ప్రాంతాల్లో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో రానున్న పది రోజుల్లో ప్రచారం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్య నేతల ప్రచార షెడ్యూల్‌ రానుందని పార్టీ నాయకులు వెల్లడించారు.

వలసలతో ఇబ్బందులు

పదేళ్ల పాలనలో అన్ని పార్టీల నాయకుల రాకతో కిటకిటలాడిన భారాస...అధికారం కోల్పోగానే ఉమ్మడి జిల్లాలోని సగానికంటే ఎక్కువగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌, భాజపాల్లోకి వలస వెళుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీకి కీలకమయిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటూ సహకార సంఘాల ఛైర్మన్‌లు, డైరెక్టర్‌లు పార్టీ మారుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రభావం చూపగల బలం ఉన్న మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డితో పాటూ గుత్తా సోదరుడు, మదర్‌ డెయిరీ మాజీ ఛైర్మన్‌ జితేందర్‌ రెడ్డి తదితరులు భారాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లడం పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామమే. అయితే నాయకులు వెళుతున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల బలం అలాగే ఉందని సీనియర్‌ నేతలు వెల్లడిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవని..ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ చేసిన మోసం ప్రజలు గమనిస్తున్నారని,  లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ప్రజలు భారాసకు పట్టం కడుతారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ‘ఈనాడు’తో ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని