logo

ఆయకట్టులో ఆగని చోరీలు

సాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు.

Published : 05 May 2024 04:34 IST

దొంగలు పగులగొట్టిన మోటారు

గరిడేపల్లి, న్యూస్‌టుడే: సాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. ఏడాదిన్నర క్రితం వరకు కేబుల్‌వైర్లు చోరీ చేసేవారు. ఇప్పుడు మోటార్లను ఊడదీసి అందులో రాగితీగ, బేరింగ్‌లు తదితర సామగ్రి తీసుకెళ్తున్నారు. పోలీస్‌శాఖ ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో చోరీల గురించి పట్టించుకోరనే నమ్మకంతో వారు తెగబడుతున్నారు.హైదరాబాద్‌, మిర్యాలగూడ నుంచి ముఠాలు ఈ చోరీలకు పాల్పడుతున్నాయి.

కేబుల్‌ నుంచి మోటార్ల వరకు..

గత 20-25 సంవత్సరాలుగా బోర్లు, బావుల వద్ద, సాగర్‌ ఎడమ కాల్వ కట్టపై, చెరువుల చుట్టూ, వాగుల పక్కన రైతులు 5 హెచ్‌పీ, 7.5 హెచ్‌పీ, 10 హెచ్‌పీ మోటార్లు ఏర్పాటు చేసుకుని ఆ నీటి వనరులతో వరి సాగు చేపడుతున్నారు. ఏడెనిమిది సంవత్సరాలుగా దొంగలు స్టార్టర్‌ నుంచి మోటారు వరకు ఉండే కేబుల్‌ను చోరీ చేసేవారు. కాపర్‌ వైరుకు గిరాకీ ఉందని గుర్తించిన దొంగలు మోటార్లలోని రాగితీగ, నియంత్రికల్లోని వైర్ల చోరీకి అలవాటు పడ్డారు. ఎంతో కాలంగా ఇలా జరుగుతున్నా రైతులు ఫిర్యాదు చేసినా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సర్వారం గ్రామం చివర ఉండే వాగు వెంట మోటార్లను పగలగొట్టి రాగితీగ చోరీ చేశారు. నెల క్రితమే కొన్ని మోటార్ల వైరు పోయిందని, మంగళవారం మరికొన్ని మోటార్లు పగలగొట్టి వైరు దొంగిలించారని రైతులు పేర్కొంటున్నారు.

నష్టం భారీగానే..

దొంగిలించిన వైరు అమ్మితే దొంగలకు రెండు, మూడు వేలు వస్తుంది. అదే రైతుకు కేబుల్‌ వైరు ఖర్చు కనీసం రూ.2,500 అవుతుంది. మోటార్లు తీసి మళ్లీ బిగించడానికి, వైరింగ్‌ చేయడానికి రూ.3 వేలు, బేరింగ్‌లు, సీల్‌, మెకానిక్‌ అంతా కలిపి రూ.1,500 అవుతుంది. దీంతో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు.

ముఠాలుగా ఏర్పడి..

దొంగలు హైదరాబాద్‌లో ఉంటూ ముఠాలుగా బయలు దేరుతున్నారు. ఒకరోజు ముందు పరిశీలన చేసి అదే రాత్రి చోరీ చేస్తున్నారు. ఆయుధాలు తీసుకెళ్లి గంటలో పని పూర్తి చేస్తున్నారు. రాత్రి పెట్రోలింగ్‌, గ్రామస్థాయిలో పోలీసులు లేరు. ఐడీ పార్టీలు ఉన్నా వారికి సైతం దొరకకుండా చోరీలు చేస్తూ రైతులను  ఇబ్బందుల పాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని