logo

ఆరుబయట నిలిపితే.. అంతే

ఈ చిత్రంలో ముఖానికి కర్చీఫ్‌ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మార్చి 28న కోదాడ పట్టణంలోని ఓ వైన్స్‌ దుకాణం ముందు రాత్రి సమయంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం మీద కాసేపు కూర్చొని, తర్వాత అతడి దగ్గర ఉన్న దొంగ కీ సాయంతో దాన్ని తీసుకుపోయాడు.

Published : 09 May 2024 06:39 IST

ఈ చిత్రంలో ముఖానికి కర్చీఫ్‌ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మార్చి 28న కోదాడ పట్టణంలోని ఓ వైన్స్‌ దుకాణం ముందు రాత్రి సమయంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం మీద కాసేపు కూర్చొని, తర్వాత అతడి దగ్గర ఉన్న దొంగ కీ సాయంతో దాన్ని తీసుకుపోయాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ దొరకలేదు.

గత నెల 12న కోదాడ పట్టణంలోని కట్టకొమ్ముగూడెం శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంటి ముందు ద్విచక్ర వాహనం నిలిపి ఉంచగా, రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగ కీ సాయంతో ఆ వాహనాన్ని చోరీ చేశాడు. నేటికీ ఆ దొంగ ఆచూకీ లభించలేదు.

కోదాడ, న్యూస్‌టుడే: ఆరుబయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలకు రక్షణ లేకుండా పోతోంది. ద్విచక్ర వాహనాలు వరుసగా చోరీలకు గురవుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టణాలనే లక్ష్యంగా చేసుకొని కాలనీల్లో ఆరుబయట నిలిపి ఉంచిన వాహనాలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోతున్నారు. ఈ వాహనాలను గుర్తించడంలో పోలీసులు అలసత్వం వహించడంతో దొంగలకు భయం లేకుండా పోయింది.

 తాళం వేసినా..

తాళం వేసి ఉంచిన ద్విచక్ర వాహనాలూ చోరీకి గురవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ప్రత్యేకంగా తాళంచెవులు చేయించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టణాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రెండు రోజులకు ఒక ద్విచక్రవాహనం చోరీకి గురవుతోంది. క్షేత్రస్థాయిలో పోలీసులు తమ దర్యాప్తులో దొంగలను కనిపెట్టలేకపోతున్నారు. దీంతో చోరీలకు గురైన వాహనాలు బాధితులకు అందట్లేదు. ఏడాది కాలంగా జిల్లాలో సుమారు 162కు పైగా వాహనాలు చోరీ కాగా వాటిలో 54 వాహనాలు మాత్రమే దొరికాయి. మిగతా 108 వాహనాల ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో వాహనం విలువ సుమారు రూ.50 వేల ధర చొప్పున లెక్కించినా సుమారు రూ.60 లక్షలు విలువ చేసే వాహనాలను బాధితులు కోల్పోయారు.

దొంగలను గుర్తించి వాహనాలు రికవరీ చేస్తాం

కొందరు దుండగులు రాత్రి సమయంలో ఆరుబయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. దొంగలను గుర్తించి వాహనాలను రికవరీ చేస్తాం. స్థానికులు రాత్రి ఆరుబయట వాహనాలు నిలిపిఉంచొద్దు.

రాము, పట్టణ ఇన్‌స్పెక్టర్‌, కోదాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని