logo

ఎల్లయ్య హత్య కేసులో కొత్త మలుపు

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట మండల కాంగ్రెస్‌ నాయకుడు వడ్డె ఎల్లయ్య హత్య కేసు బుధవారం మరో కొత్త మలుపు తిరిగింది.

Published : 09 May 2024 08:29 IST

మృతుడు వడ్డె ఎల్లయ్య

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట మండల కాంగ్రెస్‌ నాయకుడు వడ్డె ఎల్లయ్య హత్య కేసు బుధవారం మరో కొత్త మలుపు తిరిగింది. గత నెల 18న ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు తాడూరి శ్రీకాంతాచారి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. జగ్గయ్యపేట పోలీసులు అదృశ్యం కేసును హత్యగా మార్చి గత నెల 31న నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఎల్లయ్య మృతదేహాన్ని విశాఖపట్నం సముద్రంలో పడేసినట్లు చారి ఆ సమయంలో చెప్పాడు. అందుకు భిన్నంగా జరిగినట్లు అదుపులోకి తీసుకున్న వారి నుంచి తెలుసుకున్న పోలీసులు జగ్గయ్యపేట మండలం వేదాద్రి - బండిపాలెం మధ్య అటవీ ప్రాంతంలో నిందితులు సగం కాల్చి అనంతరం పూడ్చి పెట్టిన ఎల్లయ్య మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. పూర్తిగా దహనం చేయడానికి కుదరకపోవడంతో ఇంకుడు గుంత తీసి పక్కన వేసిన మట్టితో మృతదేహాన్ని ఖననం చేసినట్లు భావిస్తున్నారు. సూర్యాపేట నుంచి మృతుని కుటుంబ సభ్యులతో పాటు ఐదారు వాహనాల్లో వచ్చిన బంధు వర్గం మృతదేహం చూసి ఎల్లయ్యదే అని గుర్తించి ఒక్కసారిగా బోరున విలపించారు. వారి రోదనలు మిన్నంటాయి. తహసీల్దార్‌ శేషు, సీఐ జానకీరాం, ఎస్‌ఐ సూర్యభగవాన్‌ల సమక్షంలో వైద్యాధికారులు అక్కడే మృతదేహానికి మరణోత్తర పరీక్ష నిర్వహించారు. వ్యాపార వైషమ్యాల నేపథ్యంలో పాత నేరస్థుడైన శ్రీకాంతాచారి పథకం ప్రకారం మరికొందరి సాయంతో ఎల్లయ్యను హత మార్చినట్లు నిర్ధారణ అయింది. మృతుడి కారుని జాతీయ రహదారి పక్కనున్న కొణకంచి గ్రామంలోని ఒక ఇంటి ప్రహరీ పక్కనే ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. పంచనామా తరువాత మృతదేహాన్ని ఎల్లయ్య కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని