logo

కురుక్షేత్రం ఓ పాఠమే

ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగలో వర్గాలుగా విడిపోయి.. ప్రత్యర్థులుగా మారడం, దశాబ్దాల వైరంతో రగిలిపోవటం చూస్తుంటాం.

Published : 09 May 2024 06:59 IST

అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే: ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగలో వర్గాలుగా విడిపోయి.. ప్రత్యర్థులుగా మారడం, దశాబ్దాల వైరంతో రగిలిపోవటం చూస్తుంటాం. పోటీతత్వం, కోపం, ద్వేషం, అసూయ వంటివి ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయి, సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి తదితర అంశాలను భగవద్గీత తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో గీతాసారంలోని ఏడు ప్రధాన అంశాలను ఎన్నికలతో పోలుస్తూ ‘న్యూస్‌టుడే’ కథనం.

పరిమిత జ్ఞానం ప్రమాదం

అర్జునుడి కుమారుడైన అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలుసు కానీ.. బయటకు రాలేకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అందుకే పరిమిత జ్ఞానంతో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని ఈ ఘటన చూసి తెలుసుకోవచ్చు. ఎన్నికల్లో నాయకులకు తాము పోటీచేస్తున్న నియోజకవర్గం గురించి, ఓటర్ల ఆకాంక్షలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. ఇచ్చే హామీల సాధ్యాసాధ్యాలపై పరిజ్ఞానం ఉంటే మంచిది. అసాధ్యమైన హామీలు ఇచ్చి తర్వాత నాలుక కరచుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రజలకు సైతం నాయకులిచ్చే హామీలు, వారి గుణగణాలపై అవగాహన అవసరం.

ఆటంకాలు అధిగమించడం

కర్మను నమ్మిన వ్యక్తి కర్ణుడని చెబుతారు. ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎవరేది అడిగినా ఇచ్చే ఆయన అదే దానగుణంతో కవచకుండలాలు వదలుకుంటాడు. కష్టాలొచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. రాజకీయాల్లోనూ కష్టాలు ఎదురవుతాయి. వాటికి కుంగిపోకూడదు. ఓర్పుతో ప్రతి సమస్య, దశను అధిగమిస్తూ సాగాలి. ఇచ్చిన మాటకు కట్టుబడాలి. కానీ మనకు రక్షణగా ఉన్నవి వదులుకోకూడదన్న సత్యం గ్రహించాలి.

ప్రతీకారం నష్టం

పాండవులను నాశనం చేయాలన్న ప్రతీకార కాంక్షతో చేసిన యుద్ధంలో కౌరవులు సర్వం కోల్పోతారు. ఎన్నికల్లో సైతం ప్రతీకారేచ్ఛ పనికిరాదు. కానీ దురదృష్టవశాత్తు ప్రతీకారేచ్ఛనే రాజ్యమేలుతోంది. ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెల్చుకోవడానికి ఆరోగ్యకర వాతావరణంలో పోటీపడాలి కానీ కొందరు నాయకులు, వారి కార్యకర్తలు, అభిమానులు అనుసరిస్తున్న విధానాలు ఆందోళన కల్గిస్తున్నాయి. విద్వేషపూరితంగా కాకుండా తాము, తమ పార్టీ గెలిస్తే చేసే పనుల గురించి వివరించాలి. వ్యక్తిగతంగా తీసుకుని పరస్పరం దాడులకు దిగడం మంచిది కాదని గ్రహించాలి.

ఎవరినీ తక్కువ చేయకూడదు

కౌరవలు పాండవులను అవమానిస్తారు. ధర్మం వైపు నిలిచిన శ్రీకృష్ణుడు వారికి అండగా ఉంటాడు. ఇక్కడ ఎవరినీ తక్కువ చేసి చూడకూడదన్న సత్యం బోధపడుతుంది. రాజకీయాల్లోనూ ఈ సూత్రం పాటించాలి. ముఖ్యంగా ఎన్నికల బరిలో నిలిచిన నాయకులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అవమాన పరిచినా జరిగే నష్టం తీవ్రం. మాటలు, చేతల్లోనూ అందరినీ గౌరవించాలి.

జూదం చేటు..

కౌరవులు వేసిన పన్నాగంలో ధర్మరాజు చిక్కుకుంటాడు. శకునితో ఆడిన జూదంలో రాజ్యం, ఆస్తి, చివరకు ద్రౌపది వస్త్రాపహరణ సహా వన, అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అలాగే ఎదుటి వ్యక్తులు వేసే పన్నాగంలో మనం చిక్కుకోకుండా జాగ్రత్త వహించాలి. ఎన్నికల్లోనూ అభ్యర్థులను ప్రత్యర్థులు ఇలాగే వ్యూహాత్మకంగా ఇరికిస్తారు. ముఖ్యంగా నాయకుల బలహీనతలు, మాటకు కట్టుబడే విధానంతో శక్తికి మించిన హామీలు, లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేలా రెచ్చగొడతారు. ఇలాంటి విషయంలో సునిశిత బుద్ధితో సమయోచితంగా వ్యవహరించాలి.

ధర్మం వైపు నిలబడటం

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు మొదట తన బంధుగణంతో యుద్ధం చేయడానికి సంకోచిస్తాడు. శ్రీకృష్ణుడు అతనికి ధర్మాన్ని గుర్తు చేస్తాడు. ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచిన నాయకుడు ఏ వర్గం వారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నాయకుడిని ఆయనలోని సుగుణాల ఆధారంగా ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విలువ దక్కుతుంది.

శాశ్వత స్నేహ బంధం

మహాభారతంలో అర్జునుడు-శ్రీకృష్ణుడు.. దుర్యోధనుడు-కర్ణుడి మధ్య స్నేహం ప్రధానంగా చూస్తాం. శ్రీకృష్ణుడి స్నేహమే పాండవులను యుద్ధంలో గెలిపించడానికి దోహదం చేసింది. మరోవైపు కర్ణుడు, దుర్యోధనుని స్నేహం స్ఫూర్తిదాయకం కాదంటారు. ఎన్నికల్లోనూ స్నేహ బంధాలు కీలకం. ధర్మమార్గంలో విజయ తీరాలకు చేర్చే స్నేహితులు అవసరం. కాని ఎవరిని పడితే వారిని నమ్ముతూ చెలిమి చేస్తే చేటు తప్పదన్న విషయం గుర్తించాలి. విజయం సాధిస్తే వెంట నిలబడటం.. ఓడిపోతే మరో పక్షంలో చేరడం.. ఇలా గోడ దూకుడు స్నేహాలపై అభ్యర్థులు జాగ్రత్త వహించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని