logo

నిరంతరం నిఘా..!

ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Published : 10 May 2024 06:40 IST

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సేవలు

అంతర్జాలం లేకుంటే సీసీకెమెరాల ఏర్పాటు

 

భానుపురి, న్యూస్‌టుడే: ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించేందుకు వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తోంది. అంతర్జాలం అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా సీసీ కెమెరాల్లో వీక్షించనున్నారు. వెబ్‌కాస్టింగ్‌కు గతంలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల సేవలను వినియోగించుకోగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.

 దొంగ ఓట్లకు చెక్‌

పోలింగ్‌ కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు వచ్చి దొంగ ఓటు వేస్తున్నారనే ఫిర్యాదులు తరచూ వస్తుంటాయి. అల్లర్లు, గొడవలకు తావులేకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం 2018లో తొలిసారిగా వెబ్‌కాస్టింగ్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు నిరంతరం ఆన్‌లైన్‌లో నిక్షిప్తమవుతోంది. వీటిని జిల్లా కేంద్రంలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి అనుసంధానిస్తారు. ఎక్కడైనా అల్లర్లు, ఘర్షణలు జరిగితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దుతారు.

ఇలా పర్యవేక్షణ..

  • సమస్యాత్మక ప్రాంతాలు, వెయ్యి ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తారు.
  •  ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న యువతను  ఎంపిక చేస్తుంది.
  •  ఎంపికైన యువతకు వెబ్‌కాస్టింగ్‌ ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇస్తారు.
  • వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జిల్లా స్థాయిలో అధికారులు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని పర్యవేక్షిస్తారు.
  • ఏవైనా ఘటనలు జరిగితే వీడియో చిత్రాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.

పల్లెల్లోనే సమస్య

పల్లెల్లో 4జీ, 5జీ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇదీ పోలింగ్‌ కేంద్రాల్లో జరిపే వెబ్‌కాస్టింగ్‌కు ప్రతికూలంగా మారింది. సిగ్నల్‌ సక్రమంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కటం లేదు. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయంగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని