logo

పారదర్శకంగా లోక్‌సభ ఎన్నికలు

ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం..

Published : 10 May 2024 06:45 IST

‘న్యూస్‌టుడే’తో భువనగిరి లోక్‌సభ ఆర్వో హన్మంత్‌ కె.జెండగే

భువనగిరి, న్యూస్‌టుడే: ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం..  ఈ క్రతువు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా కసరత్తు చేపట్టాం.. పోలింగ్‌ శాతం పెంపుదలకు అన్ని చర్యలు తీసుకున్నాం.. పోలీస్‌ యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు చేపడుతోంది.. మే 13న పోలింగ్‌కు యంత్రాంగాన్ని సర్వం సన్నద్ధం చేస్తున్నామని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హన్మంత్‌ కే.జెండగే వెల్లడించారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆయన ఎన్నికల ఏర్పాట్లను వివరించారు.

  ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా.. 

ప్రజాస్వామ్యంలో ఓటును మించిన అస్త్రం మరొకటి లేదు. ఓటు విలువపై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో విస్తృతంగా స్వీప్‌ కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మహిళలపై దృష్టిపెట్టాం. స్వయం సహాయక సంఘాల సభ్యులతో ర్యాలీలు, అవగాహన సదస్సులు, ప్రతిజ్ఞ చేయించాం. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనేలా మా వంతు ప్రయత్నిస్తున్నాం. పోలింగ్‌ జరిగే 13న అరగంట కేటాయించాలి. పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేయాలి.  

2,141 పోలింగ్‌ కేంద్రాలు..

లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2,100 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. ఓటర్ల సౌలభ్యం కోసం 41 అనుబంధ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. మొత్తం పోలింగ్‌ లొకేషన్లు 1325 ఉన్నాయి. వీటిలో ఓటర్లకు తాగునీటి వసతి, విద్యుత్తు సౌకర్యం కల్పించాం. ర్యాంపులు లేని చోట నిర్మించాం. అవసరమైన చోట చలువ పందిళ్లు కూడా వేయిస్తాం. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వైద్య సిబ్బంది ఒకరు పోలింగ్‌ ముగిసే వరకు అందుబాటులో ఉంటారు. ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌లు, గైడ్‌లను బీఎల్‌వోల ద్వారా పంపిణీ చేశాం. 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి ఓటరు స్లిప్‌ వెంట తెస్తేనే ఓటేసేందుకు అనుమతిస్తాం.

ఈవీంలు సిద్ధం చేశాం..

ఈవీఎంల యాదృచ్ఛికీకరణ(ర్యాండమైజేషన్‌) పూర్తయ్యింది. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం. 220 రూట్లను ఏర్పాటు చేసి వాహనాల్లో సిబ్బందిని, పోలింగ్‌ సామగ్రిని తరలిస్తాం. పోలింగ్‌ ముగిశాక ఓట్ల లెక్కింపు జరిగే భువనగిరి అరోరా కళాశాలలో ఈవీఎంలను భద్రపరుస్తాం. ఏడు నియోజకవర్గాలకు విడిగా స్ట్రాంగ్‌ రూంలను ఏర్పాటు చేసి ఏఆర్వోలకు అప్పగించాం. 39 మంది అభ్యర్థులు రంగంలో ఉండటంతో సుమారుగా ఏడు వేల బ్యాలెట్‌ యూనిట్లు తెప్పించాం.

దివ్యాంగులు, వృద్ధులు నేరుగా..

దివ్యాంగులు, 80 ఏళ్లు పై బడిన వృద్ధులు క్యూలైన్లో నిలుచోకుండా నేరుగా ఓటేసే సౌకర్యం కల్పించాం. ప్రతి పోలింగ్‌ లొకేషన్‌లో ఒకటి చొప్పున వీల్‌ చైర్లు సమకూర్చాం. వారితో ఓటేయించేందుకు ఒక వాలంటీర్‌ను ప్రత్యేకంగా నియమించాం. దివ్యాంగులు 40,665, వృద్ధులు 10,945 మంది ఉన్నారు. వీరిలో 1364 మంది ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిని ఇంటి నుంచి తీసుకొచ్చి ఓటేశాక తిరిగి దింపేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. సాక్షం యాప్‌లో నేరుగా దరఖాస్తు చేసుకుంటే ఈ సదుపాయం కల్పిస్తాం.

పటిష్ఠ భద్రత..

పోలింగ్‌ ప్రశాంతంగా సాగేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని 2,141 పోలింగ్‌ కేంద్రాల్లో 852 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ లొకేషన్లు ఉన్నాయి. కేంద్ర బలగాలతో ఆ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తాం. 455 మంది సూక్ష్మపరిశీలకులను నియమించారు. వారికి శిక్షణ కూడా ఇచ్చాం. పోలింగ్‌ మొత్తాన్ని వెబ్‌క్యాస్టింగ్‌ చేస్తాం. ఈసీ, తాము ఆన్‌లైన్లో వీక్షిస్తాం. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.

లోక్‌సభ నియోజకవర్గంలో ఏర్పాట్లు ఇలా..

  • లోక్‌సభ నియోజకవర్గం పేరు: భువనగిరి-14
  • అసెంబ్లీ స్థానాలు : భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్‌, మునుగోడు, జనగామ, ఇబ్రహీంపట్నం
  • ఎన్నికల సాధారణ పరిశీలకుడు: రాబర్ట్‌సింగ్‌ క్షత్రిమయుమ్‌
  • వ్యయ పరిశీలకులు:  కుమార్‌ రాకేష్‌రంజన్‌, సయాన్‌ డెబర్మ
  •  సహాయ రిటర్నింగ్‌ అధికారుల: అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు, ఆర్వోకు సహాయకంగా ఇద్దరు  
  •  మొత్తం ఓటర్లు 18,08,586, పురుషులు: 8,98,416, మహిళలు 9,10,090, థర్డ్‌జెండర్‌-79
  • పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది, అధికారులు: 10,140
  • సెక్టార్‌ అధికారులు : 260
  •  రూట్లు: 220  నీ  సూక్ష్మపరిశీలకులు: 455
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని