logo
Published : 02/12/2021 04:40 IST

కర్షకులపై కాఠిన్యం !

ముస్లిం, క్రైస్తవ రథాలను అడ్డుకోవడంపై నిరసన

మహా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

పొదలకూరు రోడ్డుపై బైఠాయించిన అమరావతి రైతులు,

రోడ్డుపైనే భోజనాలు చేస్తూ..

‘సేద తీరేందుకు స్థలం లేకపోయినా భరించాం. భోజన ఏర్పాట్లకు అడ్డుపడినా సహించాం. అమరావతి కోసం ఇంకా ఎన్ని అవమానాలైనా తట్టుకుంటాం. కానీ, మతాచారాలను కించపరచవద్ధు రాజధాని అన్ని కులాలు, వర్గాలకు చెందినదని చాటేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథనాలను అడ్డుకోవద్దు’ అని అమరావతి రైతులు పోలీసుల కాళ్లపై పడినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించిన పోలీసులు.. మహా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. 30 రోజుల పాటు సజావుగా సాగిన యాత్ర.. సర్వేపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించగానే అడ్డంకులు.. ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి పడుకునేందుకు.. కనీసం భోజనం చేసేందుకు స్థలం దొరక్కపోవడంతో.. అన్నదాతలు మళ్లీ నెల్లూరులోని అంబాపురం వచ్చి బస చేయాల్సిన దుస్థితి వచ్చింది. కనీసం భోజనం చేసేందుకు స్థలం ఇవ్వకుండా అడ్డుకోవడం.. కర్షకులపై కాఠిన్యం ప్రదర్శించడమేనని ఐకాస సభ్యులు, రైతులు ఆరోపిస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: పొదలకూరు, చేజర్ల, న్యూస్‌టుడే రాజధాని అమరావతి కోసం చేపట్టిన యాత్రకు బుధవారం ఉదయం మరుపూరు సమీపంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆ వెంటనే ప్రకాశం జిల్లా ఏఎస్పీ రవిచంద్ర తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. యాత్రలో ముస్లిం, క్రైస్తవ మత రథాలను తొలగించాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో అవి లేవని అభ్యంతరం తెలిపారు. అలా మొదలైన వివాదం దాదాపు గంటకుపైగా సాగింది. ఐకాస నాయకులతో పాటు అమరాతి రైతులు రోడ్డుపైనే బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో వారిని కొందరు ప్రాథేయపడ్డారు. మాపై కనికరం చూపాలని కాళ్లు పట్టుకున్నారు. యాత్ర ప్రారంభం నుంచి ముగ్గురు దేవుళ్ల రథాలు తమతో వస్తున్నాయని, ఇంత కాలం లేనిది ఇప్పుడే అభ్యంతరం చెబుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, రైతులు ప్రశ్నించారు. అయినా.. పట్టించుకోలేదు. పొదలకూరు, నెల్లూరు రోడ్డుపై కి.మీ. మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో రైతులు.. తమ నిరసనను విరమించి.. వాహనాలను అక్కడే వదిలేసి యాత్ర కొనసాగించారు.

పొదలకూరులో ఘన స్వాగతం

మహా పాదయాత్రలో పాల్గొనేందుకు గ్రామాల నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారన్న విషయం తెలుసుకుని.. రాజకీయ పార్టీలు, పలు సంఘాల నాయకులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుని సంఘీభావం తెలిపారు. మరుపూరు వద్ద ప్రారంభమైన యాత్ర.. దాదాపు 3 కి.మీ. పొడవున సాగింది. మధ్యాహ్న భోజనం తర్వాత.. వెంటనే యాత్ర ప్రారంభమైనా.. పొదలకూరు గ్రామంలోకి ప్రవేశించగానే.. వెంకటగిరి, ఆత్మకూరు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఘన స్వాగతం పలికారు. పూలు చల్లుతూ సంఘీభావం తెలిపారు. తమ ప్రాంతంలో అన్నం తినేందుకు చోటు లభించకపోవడానికి చింతిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దారి పొడవునా మంగళహారతులు ఇచ్ఛి. కొబ్బరికాయలు కొడుతూ బ్రహ్మరథం పట్టారు.

విరాళాల వెల్లువ.. ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం వాసులు రూ.96,416 విరాళంగా అందజేశారు బుధవారం పాదయాత్రకు సంఘీభావం తెలిపి.. ఆ మొత్తాన్ని అందజేశారు.

ముందుకు సాగుతున్న యాత్ర

సాధించేంత వరకు పోరాటం

- వేలూరు రేవతి, నాగులవెల్లటూరు

అమరావతి రైతులకు ఆటంకాలు కల్పించడం ఎంతో బాధించింది. వారికి మద్దతుగా మాఊరి నుంచి వంద మంది మహిళలం తరలివచ్చాం. రాజధాని లేటు కనిపిస్తున్నా.. ప్రభుత్వం ఇంకా సరైన నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయం. అమరాతిని రాజధానిగా ప్రకటించేంత వరకు ఉద్యమంలో భాగస్వాములవుతాం.

ప్రజలు పూలతో స్వాగతం పలికారు

- శివారెడ్డి, కన్వీనరు, అమరావతి ఐకాస

కొందరు యాత్రను భగ్నం చేయాలని చూస్తుంటే.. మరోవైపు ప్రజలు పూలతో ఘన స్వాగతం పలుకుతున్నారని అమరావతి ఐకాస కన్వీనరు శివారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పది మందికి అన్నం పెట్టే అన్నదాతలకు కనీసం తినేందుకు చోటు లేకుండా చేశారన్నారు. ప్రతి చెట్టుకు కట్టిన వైకాపా జెండాలు, ఫ్లెక్సీలు తమకు స్వాగతం పలుకుతున్నట్లు భావిస్తున్నామన్నారు. రాజధాని కోసం 34వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులను 715 రోజులుగా ఏడిపిస్తున్న ప్రభుత్వం.. కనీసం పాదయాత్రనూ ప్రశాంతంగా జరగనివ్వడం లేదన్నారు. ఆయా ప్రాంతాల్లోని రహదారులను చూస్తే వారి పాలన అర్థమవుతుందన్నారు. తమపై పెట్టే శ్రద్ధ ప్రజలపై పెడితే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు. గత రెండు రోజులుగా ఈ ప్రాంత వైకాపా నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రజాబలంతో పాదయాత్రను విజయవంతం చేస్తామని ఐకాస సభ్యులు గద్దె తిరుపతిరావు, శైలజా అన్నారు.

రైతులకు భాజపా నాయకుల సంఘీభావం

నేడు ఇలా..

మహా పాదయాత్ర గురువారం ఉదయం 8 గంటలకు మరుపల్లి దగ్గర ప్రారంభవుతుంది. మధ్యాహ్న భోజన సమయానికి డేగపూడి మీదుగా తుమ్మలతలుపూరుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రారంభమై తురిమెర్ల వద్దకు చేరుకుంటారు. మొత్తం 14కి.మీ మేర యాత్ర సాగనుందని ఐకాస ప్రతినిధులు తెలిపారు.

ఆడపడుచులు అన్నం తినేందుకు చోటు లేదా?

మహాపాదయాత్రలో పాల్గొన్న సోమిరెడ్డి

400 కి.మీలకు పైగా పాదయాత్ర చేస్తున్న అమరావతి ఆడపడుచులు రోడ్డు పక్కన అన్నం తినేందుకు చోటు దక్కకపోవడం దారుణమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భోజన విరామం కోసం ఆశ్రమ స్థలంలో ఏర్పాట్లు చేస్తుంటే అర్థరాత్రి ఆపేశారన్నారు. మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంట్లు సైతం పీకేశారన్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి లేని అభ్యంతరాలు ఒక్క సర్వేపల్లిలో నియోజకవర్గంలోనే వచ్చాయా.? అని ప్రశ్నించారు.

పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని