logo

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగు

ప్రభుత్వం శనివారం స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులను ప్రకటించగా- నెల్లూరు నగరపాలక సంస్థ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

Published : 02 Oct 2022 02:03 IST

జాతీయ స్థాయిలో 60, రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: ప్రభుత్వం శనివారం స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులను ప్రకటించగా- నెల్లూరు నగరపాలక సంస్థ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లాలోని నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, ఆత్మకూరు పురపాలక సంఘాలు పోటీపడ్డాయి. తాజా ఫలితాల్లో లక్ష నుంచి పది లక్షల్లోపు జనాభా కలిగిన నగరాల్లో జాతీయ స్థాయిలో నెల్లూరు నగరపాలక సంస్థ 60వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు కైవసం చేసుకుంది. కందుకూరు పురపాలక సంఘం లక్షలోపు జనాభా విభాగంలో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం, ఆత్మకూరు, కావలి మున్సిపాలిటీలు వరుసగా 27, 45 ర్యాంకులు దక్కించుకున్నాయి.

సామాజిక మాధ్యమాల ద్వారా
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజా భాగస్వామ్యం ఎంతో కీలకం. ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకోవాల్సి ఉంది. ఆ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తుండగా.. నగరపాలక సంస్థ ఎక్కువ మంది ప్రజలను భాగస్వాములను చేసింది. ప్రజలతో పాటు వాణిజ్య సంస్థలు, సముదాయాల వద్ద హోర్డింగ్‌లు ఉంచి క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా అభిప్రాయ సేకరణలో పాల్గొనేలా అవగాహన కల్పించారు. ఇంటి నుంచి వ్యర్థాలు సేకరిస్తున్నారా? తడి, పొడి చెత్త విభజిస్తున్నారా? స్వచ్ఛగీతం విన్నారా? చూశారా? ప్రజా మరుగుదొడ్లు మీకు తెలుసా? తదితర పది ప్రశ్నలకు సమాధానం చెప్పించారు. ఆ క్రమంలో ఈ ఏడాది 80 నుంచి 90 ర్యాంకు మధ్య రావచ్చని భావించారు. జాతీయ స్థాయిలో 60వ ర్యాంకులో నిలిచింది.

పది లోపు సాధనే లక్ష్యం
స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించాం. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ ఏడాది మంచి ర్యాంకు సాధించాం. ఇదే స్ఫూర్తితో 2023లో పదిలోపు ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తాం. డివైడర్ల మధ్యలో పూల మొక్కలతో పచ్చదనం మెరుగుపరుస్తున్నాం. ఇంటింటి చెత్తను వందశాతం సేకరించి డస్ట్‌బిన్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుతాం.

- డి.హరిత, కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని