logo

Nellore: బంగారమొద్దని.. నగదు, మొబైళ్ల అపహరణ

పట్టణంలోని ఓ బంగారం కుదువ వ్యాపారి ఇంట్లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.  

Updated : 18 Mar 2024 08:48 IST

కందుకూరులో దొంగల ముఠా హల్‌చల్‌

వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నఫీజ్‌బాషా

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఓ బంగారం కుదువ వ్యాపారి ఇంట్లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.  లాకర్‌లోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరకు ఇంట్లో ఉన్న ముగ్గురిపై దాడికి దిగి రూ. 50వేల నగదు, 4 మొబైళ్లను అపహరించారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కలిగిరి రోడ్డులో కనమర్లపూడి శివరామకృష్ణ, వినీల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు. బంగారం కుదువతో పాటు కిరాణ వ్యాపారం చేస్తుంటారు. శనివారం రాత్రి యథావిధిగా దుకాణం మూసి ఇంటికెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో దొంగల ముఠా ఇంటి కరెంట్‌ తీగ కట్‌ చేసి సరఫరా నిలిపివేయగా-కొద్దిసేపటి తర్వాత ఉక్కపోతగా ఉందని శివరామకృష్ణ తలుపు తీసి.. ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ముందుగా రెక్కీ నిర్వహించిన దొంగల ముఠా.. అదే అదనుగా ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. గమనించిన ఇంటి యజమాని వారిని అడ్డుకునేందుకు యత్నించగా.. దొంగలు తమతో తెచ్చుకున్న ఇనుప రాడ్లు, స్క్రూ డ్రైవరుతో ఇంట్లో వారిని బీరువా, లాకర్‌ తెరవాలని బెదిరించారు. తాళాలు తమ వద్ద లేవనీ, తన సోదరుడి వద్ద ఉన్నాయని శివరామకృష్ణ చెప్పగా.. అతడిపై దాడి చేశారు. భార్య, కుమారుడినీ కొట్టారు. భయపడిన వినీల తన చేతికి ఉన్న బంగారు గాజులు, మెడలో గొలుసు తీసి ఇవ్వబోగా.. దొంగలు నిరాకరించారు. లాకర్‌ తెరిస్తే మొత్తం బంగారం తీసుకువెళతామంటూ సుమారు గంటకు పైగా ఇంట్లోనే ఉన్నారు. తాళాలు లేవని పదే పదే ఇంటి యజమానుల నుంచి సమాధానం రావడంతో.. బీరువా పగలగొట్టి అందులో ఉన్న రూ.50వేలు, నాలుగు మొబైళ్లను తీసుకుని వెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఆదివారం ఉదయం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, సీఐ నఫీజ్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని