logo

ఓటరన్నా.. మేలుకో!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది.

Published : 28 Mar 2024 04:30 IST

ఏప్రిల్‌ 15 వరకు నమోదుకు అవకాశం

 

న్యూస్‌టుడే, నెల్లూరు, (నగర పాలక సంస్థ), దుత్తలూరు: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. ఒక్క ఓటు ఫలితం అయిదేళ్ల పాలన. ఇంత విలువైన ఓటు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే వెంటనే నమోదుకు దరఖాస్తు(ఫారం-6) చేయాలి. ఇందుకు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకోకుంటే అర్హులైనా జాబితాలో పేరు లేదని గుర్తించినా పోలింగ్‌ రోజు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతోంది.

అప్రమత్తమైతేనే..

జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు ఉద్దేశపూర్వకంగా వందల సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు పెట్టి ప్రతిపక్షాల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు చేశారు. దీనిని గుర్తించి ఆందోళన చేయడంతో అధికారులు తప్పుడు దరఖాస్తులుగా గుర్తించి బాధ్యులపై కేసులు నమోదు చేశారు. అర్హులైన వారికి తిరిగి ఓటు హక్కు కల్పించారు. ఎన్నికల సంఘం తుది జాబితా విడుదల చేసిన తరువాత తొలగించడానికి వీల్లేదు. ఈక్రమంలో ప్రస్తుతం ఉన్న జాబితాలో పేరు ఉందో... లేదో చూసుకుంటే చాలు. లేనిపక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకుంటే హక్కు కల్పిస్తారు. ఏప్రిల్‌ 15వ తేదీ వరకు ఎన్నికల సంఘం నూతన ఓటు నమోదుకు అవకాశం ఇచ్చినందున అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సమీపంలోని వార్డు, గ్రామ సచివాలయాలు లేదా  ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. గడువు ముగిసిన తరువాత పెరిగిన ఓటర్లను తుది ఓటర్ల జాబితాకు అనుబంధంగా ప్రకటిస్తారు.మహిళా

ఓటర్లే అధికం...

జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 19,08,498 ఓటర్లు ఉండగా పురుషులు 9,35,195 మంది, మహిళలు 9,73,089 మంది ఉన్నారు. ఇతరులు 214 మంది ఉన్నారు.  కందుకూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు పట్టణం, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఈక్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యువతతోపాటు మహిళల ఆదరణ పొందిన పార్టీలకే విజయావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. ఈక్రమంలో మహిళల మద్దతు కూడగట్టుకోవడానికి పలు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని