logo

29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

Updated : 28 Mar 2024 06:20 IST

ముమ్మర ఏర్పాట్లలో తెదేపా నాయకులు

 

ఈనాడు, నెల్లూరు: వింజమూరు, కావలి, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత.. తొలిసారి చంద్రబాబునాయుడు జిల్లాకు వస్తుండటంతో నాయకులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కావలిలో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు, అనుచరులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జడ్పీ మైదానం దగ్గర హెలిప్యాడ్‌, బహిరంగ సభ ప్రాంతాలను బీద రవిచంద్ర, మాలేపాటి సుబ్బానాయుడుతో కలిసి పరిశీలించారు. వింజమూరులో పంచాయతీ బస్టాండ్‌ సమీపంలో రోడ్‌షో అనంతరం కాన్వాయ్‌ పై నుంచి చంద్రబాబు మాట్లాడేలా కసరత్తు చేస్తున్నారు. వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణబద్దుడై చంద్రబాబు వస్తున్నారని, తెదేపా అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కాకర్ల సురేష్‌, దగుమాటి కృష్ణారెడ్డిలను ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ శంఖారావం పూరిస్తారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌, మండల కన్వీనరు గొంగటి రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ కుర్తి రవీంద్రబాబు, కాకర్ల వెంకట్‌, చల్లా వెంకటేశ్వర్లు, గుణపం సుదర్శన్‌రెడ్డి, చల్లా శ్రీనివాసులు, మాజీ మండల కన్వీనరు గూడా నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యటన సాగుతోందిలా!.. చంద్రబాబునాయుడు శుక్రవారం మధ్యాహ్నం బనగానపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 2.50 గంటలకు కావలి పట్టణం అరుంధతిపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలో ఎ.ఎం.బేకరి దగ్గరకు చేరుకుంటారు. 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే సభలో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు బయలుదేరుతారు. 5.15 గంటలకు రాఘవేంద్ర ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 5.25కు బస్టాండ్‌ సమీపంలోని ప్రధాన రహదారికి చేరుకుని.. 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో వింజమూరులోని ఎస్‌.వి.కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని