logo

‘నీరో’ల పాలన

ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది.

Updated : 20 Apr 2024 05:47 IST

నాడు దాహార్తి తీర్చిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి
వాటిని అలంకారప్రాయంగా మార్చిన వైకాపా సర్కారు
ప్రజలకు తిప్పలు.. ప్రజాధనం వృథా

నెల్లూరు : నిరుపయోగంగా పథకం

ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది. యూనిట్‌ ట్యాంకులకు మదర్‌ ప్లాంట్‌ నుంచి ట్రాక్టర్‌ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి.. అందించేవారు. రూ. 2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని నిలువునా నీరుగార్చింది. జగన్‌ ప్రభుత్వ చర్యల కారణంగా నెల్లూరులో రూ. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన 30 కేంద్రాలు మూతపడ్డాయి.

న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ), కావలి, ఆత్మకూరు, దుత్తలూరు, వెంకటాచలం

నగర, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారు. బిందెడు నీటికీ చాలాచోట్ల కష్టాలు పడాల్సి వస్తోంది. వీరి దాహార్తి తీర్చే దిశగా.. జగన్‌ సర్కారు కొత్త పథకాలు ఏర్పాటు చేయకపోగా- గత తెదేపా ప్రభుత్వ పథకాలనూ మూలనపెట్టింది. ఫలితంగా 20 లీటర్ల మంచినీటి క్యాన్‌ను రూ. 20 పెట్టి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.


85 గ్రామాలకు మంచినీరు అందించాలని..

ఆత్మకూరులో ఇలా..

ఆత్మకూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో నాలుగు పథకాలు ఏర్పాటు చేసి.. 85 గ్రామాలకు శుద్ధజలాలు అందించాలని నిర్ణయించారు. సుమారు 200 వరకు పంపిణీ యూనిట్లు ఏర్పాటు చేశారు. నిర్వహణ, నిధుల లేమితో.. ప్రస్తుతం ఏఎస్‌పేట, ఆత్మకూరు మండలాల్లో మూతపడ్డాయి. మర్రిపాడు, అనంతసాగరంలో నామమాత్రంగా పనిచేస్తున్నాయి.


కావలి పట్టణం వెంగళరావునగర్‌ వంటేరు వరదారెడ్డి ఉద్యానవన ప్రాంగణంలో గతంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల పథకం ప్లాంట్‌ ఇది. రూ.2కే 20లీటర్ల నీటిని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో నిర్మించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 2017-18 ఆర్థిక సంవత్సరం నిధులతో పట్టణంలో మూడు ప్లాంట్లు ఏర్పాటు చేసి.. నీరిచ్చారు. ప్రస్తుతం ఒక్కటే పనిచేస్తోంది.


ఉదయగిరిలో 8 మూత

రంగనాయుడుపల్లి సమీపంలో దుస్థితిలో మదర్‌ ప్లాంట్

ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున మొత్తం 8 పథకాలు ఏర్పాటు చేయగా.. అన్నీ మూతపడి అలంకారప్రాయంగా మారాయి. ప్రజలు రూ. పది పెట్టి, 20 లీటర్ల క్యాన్‌ కొనుగోలు చేస్తున్నారు.


వైకాపా వచ్చిన తర్వాత నిలిపేశారు

తెదేపా హయాంలో పొదలకూరు మండలంలోని అన్ని గ్రామాలకు శుద్ధజలాలు అందించాలని చిట్టేపల్లి వద్ద రూ. 4.40 కోట్లు వెచ్చించి భారీ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మూసివేశారు. తాగునీటి కష్టాలు తప్పడం లేదు. వేసవి నేపథ్యంలో ఇబ్బంది ఎక్కువగా ఉంది.  

మల్లికార్జున్‌, డేగపూడి, పొదలకూరు మండలం


నిర్మించినా.. ఉపయోగించలేదు

ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు.. ఖర్చు పెట్టేది ప్రజల సొమ్మే కదా! ఆ విషయం విస్మరించారు. శుద్ధజలం పంపిణీ యూనిట్ల నుంచి ఇప్పటి వరకు నీటిని పంపిణీ చేయలేదు. రూ. లక్షల ప్రజాధనం వృథాతో పాటు.. తాగునీటిని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.  

నారాయణ, సోమశిల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని