logo

యువకుడి దారుణ హత్య

నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్‌ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.

Published : 24 Apr 2024 04:05 IST

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్‌ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.. కొంతకాలం స్థానికంగా ఓ హోటల్‌లో సూపర్‌వైజరుగా పనిచేశారు. అక్కడ పని మానివేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. తర్వాత కావలి ఆర్టీసీ బస్టాండులోని ఓ దుకాణంలో పనిచేశారు. ఏడాదిన్నరగా పని మానేసి ఇంటి వద్దే ఉంటున్నారు. ఇటీవల తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 22న సాయంత్రం పని ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. చివరకు విగతజీవిగా మారారు.


ఆటో నగర్‌లో మృతదేహం లభ్యం

ఇంటి నుంచి బయటకు వెళ్లిన దశరథ.. మంగళవారం అతని మృతదేహం ఆటో నగర్‌లోని పడమరవైపు ఖాళీ స్థలాల్లో పడి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు అతని కాళ్లు మడిమలు, చేతి మణి కట్లు నరకడంతో పాటు విచక్షణారహితంగా గుండెల్లో పొడిచారు. గుండెల్లోనే కత్తి చిక్కుకుపోయింది. తీవ్ర రక్తస్రావమై దశరథ అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వేదాయపాలెం పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇన్‌స్పెక్టర్‌ పీవీ నారాయణ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యవెనక బలమైన కారణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


బైక్‌ అదుపుతప్పి మృతి

నెల్లూరు(నేర విభాగం) : బైక్‌ అదుపుతప్పి యువకుడు మృతి చెందారు. నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసుల కథనం మేరకు.. ఏఎస్‌పేట మండలం చౌటభీమవరానికి చెందిన బి.లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు. వీరికి కిషోర్‌(19), కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం లక్ష్మీనారాయణ కుటుంబం ఉపాధి నిమిత్తం నెల్లూరుకు వచ్చి శెట్టిగుంట రోడ్డులో నివాసం ఉంటోంది. కిషోర్‌ స్థానికంగా సెలూన్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మంగళవారం ఆయన తెలిసిన వారి బైక్‌ తీసుకుని నగరంలోకి బయల్దేరారు. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదకు చేరుకోగానే బైక్‌ అదుపు తప్పి కింద పడ్డాడు. తలకు తీవ్రగాయం కాగా స్థానికులు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై గీతా రమ్య మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని