logo

దగాపడ్డ రైతు దళారీకే మద్దతు!

అయిదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్‌ సీఎం అయ్యాక గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు.

Published : 30 Apr 2024 04:38 IST

జగన్‌ ప్రభుత్వంలో సంక్షోభంలో వ్యవసాయం 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంట సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించి అందుకు అనుగుణంగా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తుంది.

జిల్లాలో పాదయాత్ర సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీ


న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్‌), సంగం, ఉలవపాడు

అయిదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్‌ సీఎం అయ్యాక గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు. పంట ఉత్పత్తులు అమ్ముకోవాలంటే దళారులే దిక్కయ్యారు. ధాన్యాగారంగా పేరున్న జిల్లాలో అయిదేళ్లుగా వ్యాపారులు, రైస్‌మిల్లర్లే వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగానే ఏర్పాటు చేశారు. మిర్చి, వేరుసెనగ, మెట్ట పంటలను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. నిమ్మ మార్కెట్‌ను పూర్తిగా వదిలేేశారు. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో 20వేల ఎకరాల్లో సపోటా, 25వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మామిడి రైతులకు రాయితీలు అందడం లేదు.

మామిడి తోటలకు రాయితీ సమస్య

జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగులో ఉన్నాయి. గత ప్రభుత్వాలు రైతులకు రాయితీపై ఎరువులు, పవర్‌, ట్రాక్టర్‌ స్ప్రేయర్లు, ట్రాక్టర్లు అందజేసేవి. వైకాపా ప్రభుత్వం రాయితీ విషయంలో మార్పులు చేయడం వల్ల రైతులకు ఉపయోగం లేకపోయింది. స్ప్రేయర్లకు ముందుగా మొత్తం నగదు చెల్లించి ఆపైన ప్రభుత్వం ఇచ్చినప్పుడు రాయితీ తీసుకోవాల్సివస్తోందని రైతులు వాపోయారు. ఎరువులు కూడా కొనుగోలు చేసి బిల్లులు ఉద్యానశాఖ అధికారులకు అందజేస్తే రాయితీ విడుదల చేస్తారు. దీంతో రైతులు ముందుకు రావడం లేదు. పురుగుమందుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రెండు సంవత్సరాలుగా చిన్న ట్రాక్టర్లు అందజేస్తున్నారు. అంతకుముందు మూడు సంవత్సరాలు వాటి ఊసేలేదు.

పట్టించుకోవడం లేదు

ఖాదర్‌బాషా : మామిడి తోటలు లీజుకు తీసుకుని చేసుకుంటున్నాం. గాలి వానలు, తుపానులు వచ్చినప్పుడు రాలిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులు వచ్చి తోటలు చూస్తున్న దాఖలాలు లేవు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. గత ఏడాది అకాల వర్షంతో రూ.లక్ష నష్టం వచ్చింది. ఒక్క అధికారి కూడా వచ్చి చూసిన దాఖలాలు లేవు.

అన్నదాతలకు భారంగా..

జిల్లాలో గత అయిదేళ్లలో వరి సాగు అన్నదాతకు భారంగా మారింది. మద్దతు ధర కన్నా మార్కెట్టులో ధర అధికంగా ఉందని, రైతులు ఆనందపడే సమయానికి మిల్లర్లు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కవుతూ ధరలను దిగజార్చుతున్నారు. గతేడాది జూన్‌ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం వరి ధాన్యం సాధారణ రకం పుట్టి ఒక్కింటికి రూ.18,555, ఏ గ్రేడు రకం రూ.18,725 వంతున ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ధర కన్నా అధికంగా రైతులు విక్రయిస్తున్నారంటూ దండోరా వేస్తుండటం విచిత్రం. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉండటంతో అన్నదాతలు నష్టపోతున్నారు.

ఈ ఏడాది దిగజారిన ధరలు

ఈ ఏడాది ప్రారంభంలో పుట్టి (850 కిలోలు) ధాన్యం బీపీటీ రకం రూ.23వేలు, కె.ఎన్‌.ఎం 1638కి రూ.24 వేలు, షుగర్‌లెస్‌ రూ.24.5 వేల వంతున ధర ఉంది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా అధికంగా ఉండటంతో రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ పరిస్థితి కేవలం 20 రోజులే కొనసాగింది. అనంతరం షుగర్‌లెస్‌, బీపీటీ రూ.20 వేలు, కె.ఎన్‌.ఎం 1638 రూ.19 వేలకు తగ్గింది. ధరలు దిగజారడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆంక్షలు.. దూరం

వైకాపా ప్రభుత్వం రెండేళ్లుగా ధాన్యం కొనుగోలుకు పూర్తిగా దూరమైంది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ఆంక్షలు విధించి రైతులను అక్కడకు రాకుండా అడ్డుకట్ట వేసింది. మూడేళ్ల కాలంలో కేవలం 30వేల మంది రైతులే కేంద్రాల్లో ధాన్యం విక్రయించారు. జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది రైతులుంటే వారిలో పదోవంతు కూడా లబ్ధి పొందలేకపోయారు.

తప్పని ఇబ్బందులు

సురేష్‌ : జగనన్న ప్రభత్వం వచ్చిన తర్వాత రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర రూ.18,720 ప్రకటించారు. కానీ రైతులు ప్రభుత్వానికి ధాన్యం తోలుకునే పరిస్థితి లేకుండా చేశారు. 17 శాతం తేమతో ప్రభుత్వానికి అందించాలంటే ప్రతి రైతు ధాన్యం ఆరబెట్టేందుకు కనీసం రూ.3వేలు పుట్టికి ఖర్చు పెట్టాలి. అవన్నీ చేసి ప్రభుత్వానికి ధాన్యం తోలితే నగదు సరిగా రావడం లేదు.

అంతా నష్టమే

షాన్‌వాజ్‌ : వైకాపా ప్రభుత్వంలో రైతులకు అంతా నష్టమే. దళారులు బాగుపడుతున్నారు. అధికారులు కూడా దళారులకే న్యాయం చేస్తున్నారు. ధాన్యం ఎకరాకు రూ.40వేలు పెట్టుబడి పెడుతున్నాం. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ధాన్యం కొనుగోలు చేసేవారు. వారిని రాకుండా చేశారు.

అయిదేళ్లుగా నిమ్మ మార్కెట్‌ కుదేలు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సుమారు 50 వేల ఎకరాల్లో కొన్ని రైతు కుటుంబాలు సాగు చేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన అయిదేళ్లలో మార్కెట్‌ లేక రైతులు నష్టపోతున్నారు. వ్యాపారులపై ఆధారపడి వారు చెప్పిన ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పొదలకూరు, గూడూరులో అంతర్జాతీయ స్థాయి నిమ్మ మార్కెట్లు  ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి కలగలేదు. దళారుల ద్వారా దోపిడీ జరుగుతున్నట్లు తెలిసినా పట్టించుకోలేదు.


నిమ్మ రైతుకు కష్టాలే..

మస్తాన్‌బాబు, నిమ్మ రైతు

పాదయాత్ర సమయంలో జగన్‌ నిమ్మ రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి పెట్టి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి ఒక కోల్డ్‌ స్టోరేజీ పెట్టి పంటలు కాపాడుతానని చెప్పారు. వైకాపా నాయకులు, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో ఇచ్చిన హామీ ఏమైంది. గత తెదేపా ప్రభుత్వం రైతులను రాయితీలతో ఆదుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని