logo

పింఛన్ల నీడ.. వైకాపా చీడ

Updated : 30 Apr 2024 07:16 IST

బ్యాంకుల్లో నగదు వేస్తామంటూ అధికార కుట్ర
మండుటెండలో అభాగ్యులను ఇబ్బంది పెట్టేందుకు ప్రణాళిక
వృద్ధులు, వికలాంగులు, వితంతవులపై వికృత క్రీడ

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది. సామాజిక పింఛన్ల పంపిణీలో భారీ కుట్రకు మరోసారి తెరదీసింది. నాలుగున్నరేళ్లుగా ఇంటింటికీ ఇస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని.. ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపైకి నెడుతోంది. గత నెలలో సచివాలయాల దగ్గర పంపిణీ చేసి.. వేలాది మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయగా- తాజాగా బ్యాంకుల్లో జమ చేస్తామంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులతో వికృత క్రీడ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇంటింటికీ పింఛన్లు అందించే అవకాశం ఉన్నా.. ఏప్రిల్‌ తొలి వారంలో రెండు, మూడు కి.మీ. మేర ఎండలో అవస్థలపాలు చేసిన యంత్రాంగం, అధికారపక్షం.. మే నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో అయిదు నుంచి పది కి.మీ. దూరంలో ఉండే బ్యాంకులకు వెళ్లేలా చేయడంతో పాటు.. అక్కడా అసౌకర్యాలు కల్పించి, దీనంతటికి తెదేపానే కారణమని లబ్ధిదారుల్లో విషబీజం నాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

జిల్లాలో 768 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా- వాటిలో 6,800 పనిచేస్తున్నారు. వీరితో సునాయాసంగా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా.. కావాలనే పండుటాకులతో వైకాపా ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ సారి పింఛనుదారులను సచివాలయాలకు కాకుండా.. బ్యాంకుల దగ్గరకు పంపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు గురిచేయనుంది. అనంతరం అక్కడకు వైకాపా వారు వెళ్లి.. చంద్రబాబు కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరం పెట్టిన విషయం తెలిసినా.. ప్రతిపక్షాలపై బురద జల్లిన వైకాపా సామాజిక మాధ్యమ విభాగం, గతంలో సచివాలయాల దగ్గరున్న లబ్ధిదారులతో వీడియోలు తీయించి పోస్టు చేసిన సంఘటనలు ఉన్నాయి. వైకాపా సానుభూతిపరులు మంచాలకే పరిమితమైన, పింఛనుపై ఆధారపడిన వారి దగ్గరకు వెళ్లి.. తెదేపా కారణంగానే మేము పింఛన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పించడంతో పాటు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తేనే మళ్లీ ఇంటింటికి పింఛన్లు అందుతాయని చెబుతున్నారు. ఇదంతా తెదేపాకు అంటగట్టి ఆ పార్టీపై పింఛనుదారుల్లో వ్యతిరేకత పెంచేందుకు యత్నిస్తున్నారు.

వృద్ధుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో మొత్తం 3.15 లక్షల మంది పింఛనుదారులు ఉండగా- వారిలో 1.40 లక్షల మంది వృద్ధులే. ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేనివారు వేలల్లోనే ఉంటారు. ఇలాంటి వారు మరొకరిని వెంట తీసుకుని వెళ్లాలి. అంటే.. ఒక్కొక్కరు రూ.200 నుంచి రూ.400 భరించాలి. తిండి ఖర్చు అదనం. అక్కడికి వెళ్లిన తర్వాత విత్‌డ్రా ఫాం రాయడమూ ఇబ్బందే. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకింగ్‌ సేవా కేంద్రాల నుంచి నగదు తీసుకోవడానికి వేలిముద్రలు వేయాలి. చాలా మందివి పడని పరిస్థితి ఉంది. వారు అక్కడి నుంచి దగ్గర్లోని బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కొందరికి ఏటీఎం కార్డులు ఉన్నా.. నగదు తీసుకునేందుకు మరొకరిపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో మోసాలు జరిగే అవకాశం ఉంది. నగదు కోసం ఒక్కసారిగా బ్యాంకుల దగ్గరకు వచ్చే అవకాశం ఉండటంతో.. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇదంతా పింఛనుదారుల్లో ఆందోళన నింపేందుకు వైకాపా చేస్తున్న ప్రయత్నమేనన్న ఆందోళన.. ఆవేదన వ్యక్తమవుతోంది.

2-3 రోజుల్లో పంపిణీ చేసే అవకాశమున్నా!

ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయడం వీలవుతుందని జిల్లా అధికారులు చెప్పినా.. రాష్ట్రాధికారులు వైకాపా స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు. జిల్లా అధికారుల అంచనా ప్రకారం.. జిల్లాలోని ఒక్కో సచివాలయ పరిధిలో సగటున 9 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. పంపిణీ చేయాల్సిన పింఛన్లు 350 నుంచి 500 వరకు ఉంటాయి. అంటే.. ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున 47 వరకు వస్తాయి. వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి రెండు, మూడు రోజుల సమయం తీసుకుంటుండగా- సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒకటీ, రెండు రోజుల్లోనే పూర్తి చేయవచ్చని ఉన్నతాధికారులకు తెలిపారు. ఇవేమీ పట్టించుకోలేదని సమాచారం. కేవలం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో వైకాపా కోల్పోయిన లబ్ధిని.. పింఛనుదారులను ఇబ్బంది పెట్టి తిరిగి తెచ్చుకుందామనే ధోరణితోనే వ్యవహరిస్తోంది.

బ్యాంకులంటే.. దూరం.. భారం

కావలి మండలం మున్నంగిదిన్నె గ్రామ పంచాయతీలో 287 మంది పింఛనుదారులు ఉండగా- వీరు బ్యాంకుకు వెళ్లాలంటే 8 కి.మీ. ప్రయాణించాల్సి ఉంది. కోవూరు మండలం పాటూరులో 536 ఉండగా- వీరు 9 కి.మీ. దూరంలోని కోవూరుకు, వెంకటాచలం మండలం తిరుమలమ్మపాళెం, గుడ్లూరువారిపాళెం సచివాలయం పరిధిలోని 459 మంది పింఛనుదారులు 20 కి.మీ. దూరంలోని వెంకటాచలం రావాల్సి ఉంటుంది. ఇక బోగోలు మండల కేంద్రంలో తప్ప.. ఏ గ్రామంలోనూ బ్యాంకులు లేవు. కావలి మండలం గౌరవరం, రుద్రకోట, తుమ్మలపెంట పంచాయతీల్లో మాత్రమే బ్యాంకు సదుపాయం ఉంది. మిగిలిన 14 పంచాయతీల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు.


నడవలేక అవస్థ పడుతున్నా

ఏప్రిల్‌లో ఎండలో నడవలేక.. ఇబ్బంది పడుతూ సచివాలయానికి వెళ్లి పింఛను తెచ్చుకున్నా. మే నెలలో ఇంటి వద్దకే అందించాలి. నాకు రెండు సార్లు పక్షవాతం వచ్చింది. నడవలేను. పింఛనుతోనే నేను, నా భార్య బతుకుతున్నాం. ఆటోలో వెళ్లాలంటే రూ. 100 అడుగుతున్నారు.  

నాదముని, పింఛనుదారుడు


బయటకు రావాలంటే.. భయంగా ఉంది

ఎండలకు బయటకు వెళ్లే శక్తి లేదు. వృద్ధాప్యం కారణంగా కళ్లు సరిగా కనిపించడం లేదు.  ఇప్పుడు బ్యాంకుకు వెళ్లినా  అవస్థలు పడాల్సిందే. ఇంటికే వచ్చి అందించేలా చూడాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నా. 

 సుబ్రహ్మణ్యం


ఇంటి దగ్గర ఇచ్చేలా చూడాలి

ఉదయం ఆరు గంటలకు సచివాలయం వెళితే.. ఉద్యోగులు పది గంటలకు వచ్చారు. సాయంత్రం వరకు ఉండి.. పింఛను తెచ్చుకున్నా. నేను నడవలేక చాలా ఇబ్బందులు పడ్డా. బ్యాంకులకు వెళ్లాలన్నా.. అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇంటి వద్దనే పింఛను ఇచ్చేలా చూడాలి.

కె.పెంచలమ్మ


12 కి.మీ. ఎలా వెళ్లేది

మా గ్రామంలో బ్యాంకులు లేవు. చాలా మందికి కందుకూరులోని పలు శాఖల్లో ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయ సిబ్బంది బ్యాంకుల్లో డబ్బు వేస్తాం.. తీసుకోవాలని చెబుతున్నారు. డబ్బు కోసం వెళ్లాలంటే 12కి.మీ ప్రయాణించాలి. బస్సు సౌకర్యం లేదు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలి. ఈ ఎండలకు అంత సాహసం చేయగలమా?

- బి.వెంకటేశ్వరరెడ్డి, పాలూరు-దొండపాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని