logo

ఆర్భాటమే.. అభివృద్ధేది జగన్‌!

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... ఆర్భాటంగా పనులు మంజూరు చేస్తూ.. శంకుస్థాపనలు చేయించింది. చాలాచోట్ల ప్రతిపాదనలకే పరిమితం కాగా.. కొన్నిచోట్ల టెండరు దశలోనే నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు.

Updated : 05 May 2024 05:12 IST

ప్రగతిలేని పనులు
న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), కావలి, కందుకూరు, కోవూరు, ఆత్మకూరు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... ఆర్భాటంగా పనులు మంజూరు చేస్తూ.. శంకుస్థాపనలు చేయించింది. చాలాచోట్ల ప్రతిపాదనలకే పరిమితం కాగా.. కొన్నిచోట్ల టెండరు దశలోనే నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు.


50 ఇళ్లు కూడా పూర్తికాలేదు

కావలి పట్టణంలోని జగనన్న లేవుట్‌లో 12వేల ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఆ తరువాత 8వేల మంది ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన భూమిలో చదును పనులు చేపట్టారు. అందులో తొలి విడతగా నాలుగువేల మందికి గృహాలు సిద్ధమయ్యేలా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 50 ఇళ్లు కూడా పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల నిధులతో ఇళ్లు నిర్మించుకోలేమని లబ్ధిదారులు చేతులెత్తేశారు. అన్నింటినీ నిర్మించేలా అనధికారిక గుత్తేదారులను తీసుకొచ్చారు. వారు గృహ నిర్మాణ సామగ్రిలో చేతివాటం చూపడం, పోలీసుస్టేషన్లలో పంచాయతీలు ఇలా అక్రమాలు చోటుచేసుకున్నాయి. పేదలకు గూడు కల్పించడంలో ప్రభుత్వం వెనుకబడి పోయింది.


కలగానే.. మినీ స్టేడియం

ఆత్మకూరులో క్రీడాకారుల ఆశలపై వైకాపా ప్రభుత్వం నీళ్లు చల్లింది. గత తెదేపా ప్రభుత్వం మినీ స్టేడియం నిర్మాణానికి, క్రీడాభివృద్ధికి రూ.2 కోట్లతో పనులు చేపట్టింది. స్టేడియం పనులు పిల్లర్లు పూర్తై శ్లాబు దశకు వచ్చాయి. ఇంతలో ఎన్నికలు జరిగిన వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పనులు రద్దు చేయడంతో నిధులు ఆగిపోయాయి. స్టేడియం శ్లాబుకే పరిమితమైంది. కనీసం ప్రతిపాదనలు పంపి పూర్తిచేయాలన్న ఆలోచన చేయలేదు. దీంతో క్రీడాకారులు నిరాశకు గురయ్యారు.


రెండేళ్లయినా 15 శాతం పనులే..

నెల్లూరు పెన్నా వారధి నుంచి జాఫర్‌సాహెబ్‌ కాలువ ద్వారా మైపాడు, తోటపల్లి గూడూరు మండల పరిధిలో 11 బ్రాంచి కాలువల నుంచి 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వెళుతోంది. నగరంలో కాలువ గట్టుకు ఇరువైపులా ఇళ్లు ఉన్నాయి. చెత్తాచెదారం, మురుగు కలవకూడదని, నివాసాలుండే పేదలకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో కాలువకు ఇరువైపులా గోడల నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలవనరులశాఖ ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి కాగా మూడేళ్ల కాలపరిమితితో పాత చెక్‌పోస్టు నుంచి మైపాడు గేటు, అక్కడ నుంచి జాతీయ రహదారి వరకు రెండు ప్యాకేజీలుగా 2.20 కి.మీ మేర రూ.74 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. గడువులోపు పనులు పూర్తిచేస్తే రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. రీటైనింగ్‌ వాల్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికి రెండేళ్ల సమయం అయింది. మొత్తం పనిలో 15 శాతమే పూర్తయింది.


ఏవీ డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌

కందుకూరు పట్టణంలో ఎక్కడా డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ లేదు. ద్వితీయశ్రేణి మున్సిపాలిటీగా ఉన్న ఇక్కడ అవి ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గత తెదేపా ప్రభుత్వంలో ఓవీ రోడ్డు వెడల్పు, డివైడర్‌కు ప్రతిపాదించి టెండర్లు పిలిచారు. రోడ్డుకు ఇరువైపులా రెండేసి మీటర్లు చొప్పున వెడల్పు చేసి సీసీ రోడ్లు నిర్మించారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో డివైడర్‌ పనులు ప్రారంభం కాలేదు. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని విస్మరించింది. గతేడాది సీఎం జగన్‌ మున్సిపాలిటీకి ఇచ్చిన రూ.26 కోట్ల హామీల్లో భాగంగా ఓవీరోడ్డులో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు మళ్లీ తెరపైకి తెచ్చారు. సుమారు రూ.2 కోట్లతో పనులు చేసేందుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ ముగిసి 8నెలలు దాటినా నేటికీ అడుగు ముందుకు పడలేదు.


శంకుస్థాపనతో సరి

ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాళెం, విడవలూరు మండలంలోని ముదివర్తి గ్రామాల నడుమ పెన్నానదిలో సబ్‌మెర్సిబుల్‌ కాజ్‌వే నిర్మాణానికి ఏడాది క్రితం సీఎం జగన్‌ రూ.100 కోట్లను కేటాయిస్తు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు పనులు చేపట్టలేదు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి మాత్రం ఎన్నికలకు ముందు ఆయన ప్రజల వద్దకు వెళ్లి వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆయన విజయం సాధించినా కాజ్‌వే నిర్మాణం కాలేదని ప్రజలు వాపోతున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే విడవలూరు, ఇందుకూరుపేట మండలాల మధ్య కేవలం ఒక్క కిమీ దూరమే ఉంటుంది. ప్రస్తుతం 25 కి.మీ. దూరం ఉంది. కాజ్‌వే చేపట్టక పోవడంతో సముద్ర జలాలు పెన్నానది నుంచి భూగర్భంలో ఎగువకు రావడం వల్ల విడవలూరు, ఇందుకూరుపేట మండలాల్లోని గ్రామాల్లోకి ఉప్పునీరు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని