logo

జీపీఎస్‌ వాహనాల్లోనే ఈవీఎంల తరలింపు

జిల్లాలో ఈనెల 13న ఎన్నికల పోలింగ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి పోలింగ్‌ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Published : 09 May 2024 05:45 IST

లెక్కింపు, స్ట్రాంగ్‌ రూములు పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో ఈనెల 13న ఎన్నికల పోలింగ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి పోలింగ్‌ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ  ఈనెల 12వ తేదీ ఉదయం ఆరు గంటలకు 255 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13వ తేదీ తిరిగి రావడానికి బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎంపిక చేసిన రూట్‌మ్యాప్‌ ప్రకారమే బస్సులను నడపాలని, జీపీఎస్‌ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలను తరలించాలని ఆదేశించారు. పోలింగ్‌ రోజు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆటోలు ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో లవన్న, శిక్షణ కలెక్టర్‌ సంజనా సింహ, నోడల్‌ అధికారులు బాపిరెడ్డి, సాల్మాన్‌రాజు, చందర్‌, పద్మావతి, కన్నమనాయుడు, రాజశేఖర్‌, సదారావు తదితరులు పాల్గొన్నారు.

భారీ భద్రత ఏర్పాటు చేయాలి..

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్‌ కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్‌ మండలం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ సెంటర్లు, స్ట్రాంగ్‌ రూములను బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్డీవో మలోల, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

జిల్లాకు చేరుకున్న ఐపీఎస్‌లు

నెల్లూరు(నేర విభాగం) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు పలువురు ఐపీఎస్‌లు చేరుకున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో 163 మంది శిక్షణ ఐపీఎస్‌లను వివిధ జిల్లాలకు కేటాయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాకు మయాంక్‌ మిశ్రా, పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌, ప్రతీక్‌ సింగ్‌, కుష్‌ మిశ్రా, సూరజ్‌ డి, అభినవ్‌ ద్వివేది, జామాసోనార్‌, అషిమా వాశ్వాణి, అపర్ణను కేటాయించారు. వీరందరూ బుధవారం జిల్లాకు చేరుకున్నారు. ఎన్నికలు ముగిసే వరకు వీరు జిల్లాలోనే ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని