logo

పసిమొగ్గలపై శీతకన్నేల పాలకా!

బాలల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం.. బడులన్నీ బాగు చేస్తున్నాం.. అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం.. ఇవీ జగన్‌ మాటలు. క్షేత్రంలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. కూలే భవనాలు.. ఇరుకు గదుల్లో ఊపిరాడక బాలలు అల్లాడిపోతున్నారు.

Published : 10 May 2024 04:25 IST

న్యూస్‌టుడే బృందం

బాలల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం.. బడులన్నీ బాగు చేస్తున్నాం.. అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాం.. ఇవీ జగన్‌ మాటలు. క్షేత్రంలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. కూలే భవనాలు.. ఇరుకు గదుల్లో ఊపిరాడక బాలలు అల్లాడిపోతున్నారు. అయిదేళ్లుగా వీటికి శాశ్వత భవనాలు నిర్మించడంలో పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆటపాటలతో బోధన సాగాల్సిన కేంద్రాల్లో పసిమొగ్గలకు కష్టాలు అలవడుతున్నాయి.

ఇరుకు గదిలో..

కావలి : పట్టణంలోని వడ్డిపాలెంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం ఓ ఇంటి వెనుక వైపు ఉన్న ఇరుకు గదిలో నిర్వహిస్తున్నారు. గాలి, వెలుతురు సరిగా లేని గదిలోనే పిల్లల్ని బంధించినట్లుగా కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో చాలామంది తల్లిదండ్రులు అక్కడకు పంపించేందుకు వెనుకాడుతున్నారు. సొంత భవనాల్లేని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కార్యకర్తలకు కష్టంగా మారుతోంది. ఈ కేంద్రాలకు అద్దె నెలవారీగా విడుదల కావడం లేదు. నాలుగైదు నెలలకో సారి మంజూరవుతున్నాయి. ఈక్రమంలో సరైన వసతుల్లేని భవనాల్లోనే సరిపెడుతున్నారు.


అరకొర వసతులే

కందుకూరు పట్టణం : నియోజకవర్గంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను అరకొర వసతులతోనే నిర్వహిస్తున్నారు. గర్భిణులు, బాలింతలతో పాటు అయిదేళ్ల లోపు బాలలకు సేవలందించేందుకు ఏర్పాటుచేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో అనేక కేంద్రాలకు శాశ్వత భవనాలు లేవు. పట్టణంలో మొత్తం 60 కేంద్రాలుండగా, సుమారు 20 కేంద్రాలకు పైగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఫ్యాన్లు, మరుగుదొడ్లు సక్రమంగా లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. గుడ్లూరు మండలంలోని మిట్టపాలెంలో అంగన్‌వాడీ కేంద్రం ఆరేళ్లుగా వాడుకలో లేకపోవడంతో కంప చెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం అద్దె భవనంలో నడుపుతున్నారు.నాడు-నేడు అని చెప్పుకుంటున్నా ఈ భవనాన్ని పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది.


భయం.. భయంగా..

దుత్తలూరు : వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్‌వాడీ కేంద్రాలపై నిర్లక్ష్యం చూపింది. నియోజకవర్గంలో 76 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 13,756 మంది చిన్నారులు ఉన్నారు. పలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక చిన్నారులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.  పాత, అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాల్లో వసతులు లేక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యుత్తు సౌకర్యంతోపాటు పంకాలు లేకపోవడంతో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రెండేళ్ల క్రితం నూతనంగా భవనాలు మంజూరు చేసినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. పలు కేంద్రాలు శిథిలావస్థకు చేరడంతో కార్యకర్తలు గత్యంతరం లేక పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు.


ప్రమాదకరంగా..

అల్లూరు : మండల కేంద్రమైన అల్లూరులోని రామాపురం సంఘం కాలనీలో అంగన్‌వాడీ భవనం ప్రమాదకరంగా ఉంది. శిథిలావస్థకు చేరుకుంది. గోడలు పగుళ్లిచ్చాయి. తలుపులు కూడా లేవు. ఎప్పుడు కూలుతుందోనని కార్యకర్త, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  అయినా ఇందులోనే బాలలకు బోధన చేస్తున్నారు. దీనికి భవనం నిర్మించాలన్న దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని