logo

మస్తు చెప్పారు ఉపాధి ఆపేశారు

పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోపాటు వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాయితీతో అందించే రుణాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది.

Published : 10 May 2024 04:43 IST

బీసీ, మైనార్టీలకు రాయితీ రుణాలేవీ
నష్టపోయిన యువత
న్యూస్‌టుడే, దుత్తలూరు

ప్రకటన: మీ అన్న వస్తున్నాడు... మన ప్రభుత్వం వచ్చాక బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన వారిని గుర్తించి మెరుగైన ఉపాధి పథకాలు అమలు చేస్తాం... యూనిట్లు స్థాపించుకునేందుకు యువతకు విరివిగా రాయితీ రుణాలు అందజేస్తాం..

- ప్రతిపక్ష నాయకుడి హోదాలో సీఎం జగన్‌


వాస్తవం: వై.ఎస్‌. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బీసీ, మైనార్టీ యువతకు అరచేతిలో వైకుంఠం చూపించారు. వెనుకబడిన బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమాన్ని అటకెక్కించారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అర్హులైన పేదల జీవనోపాధి మెరుగుపర్చేందుకు ఇవ్వాల్సిన బీసీ, మైనార్టీ రాయితీ రుణాలను అయిదేళ్ల పాలనలో పూర్తిగా ఎగ్గొట్టేశారు.

పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోపాటు వారికి మెరుగైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రాయితీతో అందించే రుణాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే రుణాలు సైతం యువతకు దక్కనీయకుండా చేసింది. గత ప్రభుత్వంలో బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు అనుసంధానంతో రాయితీ రుణాలు అందించారు. వీటి ద్వారా వేల మంది వివిధ యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి పొందారు. పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఒక్కో యూనిట్కు రూ. 3- 50 లక్షల వరకు రుణం ఇచ్చేవారు. జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 13,437 యూనిట్లు మంజూరు చేయటమే కాకుండా వారికి వివిధ బ్యాంకుల ద్వారా రూ. 476.32 కోట్ల రాయితీ రుణాలు ఇచ్చారు. రాయితీ రుణాలు ఇచ్చేందుకే సుముఖత చూపని సీఎం జగన్‌ ప్రతి బీసీ వర్గానికి ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఆది నుంచి నిధులు, విధులకు నోచుకోని ఆ కార్పొరేషన్లు అధికార పార్టీ నాయకులకు పదవులు కల్పించడానికే మినహా ఇప్పటి వరకూ రూపాయి కూడా రుణంగా ఇచ్చిన పరిస్థితి లేదు. నవరత్నాల సాకుతో ఎంతో ఉపయోగపడే రాయితీ రుణాలకు వైకాపా ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికింది.

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో అప్పటికే ఉన్న కార్పొరేషన్ల ద్వారా జిల్లాలో రూ. 102 కోట్లతో పది వేలకు పైగా యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. వీటికి దాదాపు 74 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఏడాది మొత్తం కాలక్షేపం చేసి చివరకు రుణ మంజూరు ప్రక్రియను మౌఖిక ఆదేశాలతో నిలిపివేశారు.


రుణంతో చిరు వ్యాపారం

-కృష్ణ, దుత్తలూరు

తెదేపా హయాంలో రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా. కొన్ని రోజుల తరువాత అధికారులు ఇంటర్వ్యూకు పిలిచారు. రుణం మంజూరైతే ఏ వ్యాపారం చేస్తారని అడిగారు. అన్ని వివరాలు వారికి చెప్పడంతో రుణం మంజూరు చేశారు. సిఫార్సు లేకుండా రుణం మంజూరు అవటంతో చిరు వ్యాపారం పెట్టుకున్నా. ఈ డబ్బుతో ప్రారంభించిన వ్యాపారం నేటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తోంది. తీసుకున్న రుణంలో యాభై శాతం ప్రభుత్వం చెల్లించగా మిగిలినవి విడతలవారీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లించాను.


మంజూరు కాలేదు

-వెంకటరమణ, దుత్తలూరు

బీసీ కార్పొరేషన్‌ కింద 2020లో రాయితీ రుణాలు మంజూరు చేస్తున్నారని తెలిసి దరఖాస్తు చేశా. నెలల తరబడి ఎదురుచూసినా ఎలాంటి ఫలితంలేదు. రుణం మంజూరవుతుందని ఆశతో ఉన్నా. అధికారులను అడిగినా సమాధానం లేదు. స్నేహితులు కొంతమంది రుణాలు మంజూరు ఆపివేశారని చెప్పారు. దాంతో ఎంతో నిరాశ చెందా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని