logo

ఫాంపాండ్స్‌ నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు

ఫాంపాండ్స్‌ నిర్మాణాలకు కామారెడ్డి జిల్లా పాలనాధికారి జితేశ్‌ వి పాటిల్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది భూగర్భజలాలు తగ్గుముఖం పట్టి యాసంగి సీజన్‌లో బోరుబావులు వట్టిపోయాయి. చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి.

Updated : 23 May 2024 06:19 IST

ఉపాధి కూలీల భూముల వివరాలు సేకరణ
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

రైతుల పొలంలో నిర్మిస్తున్న ఫాంపాండ్‌

ఫాంపాండ్స్‌ నిర్మాణాలకు కామారెడ్డి జిల్లా పాలనాధికారి జితేశ్‌ వి పాటిల్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది భూగర్భజలాలు తగ్గుముఖం పట్టి యాసంగి సీజన్‌లో బోరుబావులు వట్టిపోయాయి. చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి. భూగర్భజలాలను పెంచడానికి తగిన చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవడానికి కలెక్టర్‌ ఫాంపాండ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టారు. జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పించి వారి పంటపొలాల్లో ఉపాధిహామీపథకం కింద వీటి నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు వెళ్లాయి. వానాకాలం ప్రారంభమయ్యేలోపు వీలైనన్నీ నిర్మాణాలు చేపట్టడానికి అధికారులు కరసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. 

క్రియాశీలక కూలీల భూముల్లోనూ..

కామారెడ్డి జిల్లాలో మొత్తంగా 2.55 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో  1.75 లక్షల జాబ్‌కార్డుల కూలీలు క్రియాశీలకంగా ఉపాధి పనులకు హాజరవుతారు. ఉపాధి పనులకు రెగ్యులర్‌గా హాజరయ్యే కూలీలకు చెందిన భూముల్లో ముందుగా ఫాంపాండ్స్‌ నిర్మించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. క్రియాశీలక కూలీల్లో ఎంతమందికి భూములు ఉన్నాయి. వాటి విస్తీర్ణం ఎంత అనే వివరాలను పంచాయతీ కార్యదర్శులు జిల్లా యంత్రాంగానికి నివేదిస్తారు. ఫాంపాండ్స్‌ నిర్మాణాలతో తమ భూమి కోల్పోతామనే భావన చాలా మందిలో ఉంటుంది. రెండేళ్ల కిందట జిల్లావ్యాప్తంగా సుమారు మూడు వేల ఫాంపాండ్స్‌ నిర్మించారు. వాటిని చాలా మంది రైతులు పూడ్చివేశారు. ఫాంపాండ్‌ నిర్మించే ప్రదేశంలో పంటను కోల్పోతున్నామనే బాధ రైతులకు ఉంటుంది. ఈ విషయంలోనూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫాంపాండ్‌లో చేపల పెంపకం చేపట్టడం వల్ల అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.

రైతులకు  అవగాహన పెంచేలా..

ప్రతి రైతు తనకున్న వ్యవసాయ భూమిలో కచ్చితంగా ఒక ఫాంపాండ్‌ నిర్మించుకోవాలని భూగర్భజలశాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లో ఆసక్తి ఉన్న రైతుల వివరాలను ముందుగా సేకరించనున్నారు. వారికి ఫాంపాండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరిస్తారు. ఆ తర్వాత ముందుకు వచ్చిన రైతుల భూముల్లో నిర్మాణాలు చేపడుతారు. వాస్తవానికి రైతు భూవిస్తీర్ణంలో పదిశాతం భాగంలో ఫాంపాండ్‌ లేదా కందకాలను నిర్మించుకోవడం ఉత్తమం. వర్షం నీటిని వీలైనంత ఎక్కువగా భూమిలోకి పంపించే విధంగా చేయడంతో భూగర్భజలాలు స్థిరంగా ఉంటాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని