logo

శుభ్రతకు సుస్తి.. నిబంధనలకు స్వస్తి

నగరపాలక సంస్థ పరిధిలోని ఆహారశాలల్లో కొన్నేళ్లుగా అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆహార భద్రతా ప్రమాణాల కార్యాలయం అధికారి మూడు జిల్లాలకు ఒక్కరే ఉండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.

Published : 23 May 2024 02:32 IST

తనిఖీలతో ఆహారశాలలపై అధికారుల కొరడా
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

జరిమానా వసూలు చేస్తున్న ఎంహెచ్‌వో సాజిత్‌అలీ

గరపాలక సంస్థ పరిధిలోని ఆహారశాలల్లో కొన్నేళ్లుగా అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆహార భద్రతా ప్రమాణాల కార్యాలయం అధికారి మూడు జిల్లాలకు ఒక్కరే ఉండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఇటు నగరపాలక సంస్థ, ఆటు ఆహార భద్రతా అధికారుల నిర్లక్ష్యంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరందు ఆదేశాలు ఇవ్వడంతో పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించని వాటిని గుర్తించి మొదటి రోజు హెచ్చరించారు. పరిస్థితి మారకపోతే జరిమానాలు వసూలు చేశారు.

5 సర్కిళ్లలో తనిఖీలు

నగరపాలక సంస్థ పరిధిలోని 5 సర్కిళ్లలో ఉన్న పారిశుద్ధ్య పర్యవేక్షకులు, సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆహార విక్రయశాలల్లో తనిఖీలు చేశారు. వంటగది, సరకులు, ప్లేట్లు శుభ్రపరిచే ప్రాంతం, టేబుళ్లు ఇలా అన్నింటిని పరిశీలించారు. అపరిశుభ్రంగా కనిపించిన హోటళ్ల యజమానులను హెచ్చరించి వదిలేశారు. మరుసటి రోజు నుంచి ఇలా ఉంటే జరిమానాలు విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్లాస్టిక్‌ సంచులూ వినియోగించొద్దు

దుకాణాలు, హోటళ్లు, టీస్టాళ్లలో ప్లాసిక్‌ కవర్లు దొరికితే ఊరుకునేది లేదని ఎంహెచ్‌వో సాజిత్‌అలీ హెచ్చరించారు. నిత్యం ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని పాలిథిన్‌ సంచులు దొరికితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కనిపించని మార్పు..

మంగళవారం పలు హోటళ్ల యజమానులను హెచ్చరించినా మార్పు రాలేదు. అధికారులు ఎప్పుడు ఇలా వస్తారని నిర్లక్ష్యంగా వ్యహరించారు. బుధవారం నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్‌పీ రోడ్డులోని ఉన్న 12 దుకాణాలను నగరపాలక సంస్థ ఎంహెచ్‌వో సాజిత్‌అలీ తనిఖీలు చేపట్టి రూ.18 వేల జరిమానాలు వసూలు చేశారు. 15 హోటళ్లు తనిఖీలు చేయగా.. మూడు మినహా 12 హోటళ్లకు స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానాలు విధించారు. మరోసారి ఇదే పరిస్థితి కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని