logo
Updated : 05/12/2021 06:19 IST

హామీ తీరక.. వేతనం చాలక

పది రోజుల్లో ఇద్దరు వీఆర్‌ఏల ఆత్మహత్య
పే స్కేల్‌ అమలుకు ఆందోళన బాట
 ప్రజా పనులపై ప్రభావం
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌
కామారెడ్డిలో నిరసన తెలుపుతున్న గ్రామ రెవొెన్యూ సేవకులు

మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌కు చెందిన వీఆర్‌ఏ రమేశ్‌ నవంబరు 24న ఆత్మహత్య చేసుకున్నారు. పే స్కేల్‌ అమలు కాకపోవడంతో అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డారని సహచర ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం పెగడాపల్లికి చెందిన వీఆర్‌ఏ హర్షవర్ధన్‌ కూడా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతిచెందారు. పది రోజుల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వీఆర్‌ఏలకు పేస్కేల్‌ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2020 సెప్టెంబరు 9న శాసనసభలో ప్రకటించారు. 15 నెలలు గడుస్తున్నా అతీగతీ లేదంటూ వీఆర్‌ఏలు నిరసన బాటపట్టారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా అన్ని తహసీల్దారు కార్యాలయాల ఎదుట గత నెల 29 నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దీక్షలు చేస్తున్నారు.


పే స్కేల్‌ కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన బాటపట్టారు. విధులు బహిష్కరించి దీక్షా శిబిరాల్లో కూర్చుంటున్నారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినప్పటి నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూతోపాటు అన్నిశాఖల పనుల్లో భాగస్వామ్యం చేస్తున్నారని మదనపడుతున్నారు. అయినా కనీస వేతనం అమలుకావడం లేదని వాపోతున్నారు. పోటీ పరీక్షల్లో వీఆర్‌ఏ ఉద్యోగం సాధించిన విద్యావంతులకు పదోన్నతులు కల్పించడం లేదంటున్నారు. నిత్యం 12 నుంచి 15 గంటలు పనిచేస్తున్నా పే స్కేల్‌ వర్తించడం లేదని ఆందోళన చెందుతున్నారు.

ప్రత్యక్ష పద్ధతిలో ఎంపికైనా..

2012కు ముందు వీఆర్‌ఏల ఎంపికలు పరోక్ష పద్ధతిలో జరిగేవి. ఆ తరువాత వారి నియామకాలను అప్పటి ఏపీపీఎస్సీకి అప్పగించారు. పరోక్ష పద్ధతిపై జిల్లావ్యాప్తంగా 1,460 మంది ఉండేవారు. 2012లో తొలిసారిగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో 60 మంది కొత్తగా ఎంపికయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 1520 మంది విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారికి పదోన్నతులు కల్పించాలనే నిబంధన ఉన్నప్పటికీ అమలు కావడం లేదు.

వీఆర్వో వ్యవస్థ రద్దుతో..

* ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత వీఆర్‌ఏలు కీలకంగా మారారు.

* కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తుల పరిశీలన, ప్రభుత్వ భూముల సంరక్షణ, భూరికార్డులు భద్రపరచడం, కులం, ఆదాయ, నివాస ధ్రువపత్రాల దరఖాస్తులు విచారించి నివేదిక ఇవ్వడం, ధరణి దరఖాస్తులు, ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి పనులు వీరే చేస్తున్నారు.

* ఇవి కాకుండా కంప్యూటర్‌ ఆపరేటర్‌, సెక్షన్‌ అసిస్టెంట్‌, రికార్డు కీపర్‌, అటెండర్‌, వాచ్‌మెన్‌, డ్రైవర్‌ వంటి పనులు చూస్తున్నారు.

* ఇటీవల వరి కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని తెలుసుకొనే బాధ్యతలు అప్పగించారు.

* గ్రామాల్లో పోలీసులకు సహాయకులుగా, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, జలవనరులశాఖల్లోనూ భాగస్వామ్యమవుతున్నారు.

* ఆరు రోజులుగా నిరసన దీక్షల్లో ఉండడంతో ప్రజోపయోగ పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

* మధ్యాహ్నం నుంచి హాజరవుతున్నా పూర్తి చేయడం కష్టమవుతోంది. ముఖ్యంగా ధరణి రిజిస్ట్రేషన్ల సమయంలో రికార్డులు పరిశీలనకు అందుబాటులో లేకపోవడంతో అధికారులే చేయాల్సి వస్తోంది.

అన్ని పనులకు వాడుకుంటున్నారు - మెట్టు రవీందర్‌, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రస్తుతం ఒక్కో వీఆర్‌ఏకు నెలకు రూ.10,500 వేతనం, డీఏ రూ.700, ఇంక్రిమెంట్‌ రూ.200 మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 30శాతం పీఆర్సీ అమలు కావడం లేదు. అన్ని పనులకు మమ్మల్నే వాడుకుంటున్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ బాధతోనే ఇద్దరు వీఆర్‌ఏలు ఆత్యహత్య చేసుకున్నారు. పే స్కేల్‌ అమలు చేయాలి.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని