logo

మంత్రి ఇలాఖాలో ఇచ్చింది 112 ఇళ్లే

మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొనొద్దని పిలుపునిచ్చినా రైతులు పెద్దసంఖ్యలో తరలొచ్చారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. వేల్పూర్‌లో భాజపా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతుధర్నాకు ఎంపీ అర్వింద్‌ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎంపీ హామీ గురించి మాట్లాడుతున్న

Published : 17 Aug 2022 02:46 IST

రైతుధర్నాలో ప్రసంగిస్తున్న రఘునందన్‌రావు, వేదికపై ఎంపీ అర్వింద్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు

బస్వాలక్ష్మీనర్సయ్య, పల్లె గంగారెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, దినేష్‌ కులాచారి, కంచెట్టి గంగాధర్‌

ఈనాడు, నిజామాబాద్‌: మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొనొద్దని పిలుపునిచ్చినా రైతులు పెద్దసంఖ్యలో తరలొచ్చారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. వేల్పూర్‌లో భాజపా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతుధర్నాకు ఎంపీ అర్వింద్‌ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎంపీ హామీ గురించి మాట్లాడుతున్న మంత్రి తెరాస మేనిఫెస్టోపైనా చర్చించాలన్నారు. ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ ఏమైందన్నారు. వంద రోజుల్లో చక్కెర పరిశ్రమ తెరుస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా ఉపాధి అంటూ చెప్పిన మాటలు మీవి కావా అని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై సహచట్టం ద్వారా వివరాలు సేకరించానని, మంత్రి ఇలాఖాలో కేవలం 112 మందికే ఇచ్చారని పేర్కొన్నారు. తాళ్లరాంపూర్‌ సొసైటీలో అక్రమాలకు పాల్పడిన నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. తాను వస్తుంటే అడ్డుకొనే ప్రయత్నాలు చేశారని, ప్రశ్నించే గొంతులను నొక్కటమే తెరాస ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.

ఐదు నెలల్లో కేంద్రాన్ని ఒప్పించా: ఎంపీ అయ్యాక ఐదు నెలల్లోపు పసుపు రైతుల సమస్య పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించానని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చెప్పారు. దీని ఫలితంగానే సుగంధద్రవ్యాల బోర్డులో భాగమైన స్పైస్‌బోర్డు ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ నిజామాబాద్‌లో ఏర్పాటైందన్నారు. గడిచిన మూడేళ్లలో ఈ కార్యాలయం ద్వారా రూ.30 కోట్లు తెచ్చానని, దిగుమతులు నిలిపి పంటకు డిమాండ్‌ పెరిగేలా కృషి చేసినట్లు చెప్పారు. ఎంపీగా పనిచేసిన కవిత కేవలం బోర్డు పేరుతో కాలయాపన చేశారని ఎద్దేవా చేశారు. ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఉన్నా కేసీఆర్‌, కేటీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. తాము రైతుధర్నా పెట్టుకుంటే ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. మంత్రి సోదరుడిని ఉద్దేశించి విమర్శలు చేశారు. జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నాయకులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, దినేష్‌ కులాచారి, మాల్యాద్రిరెడ్డి, స్రవంతిరెడ్డి, కంచెట్టి గంగాధర్‌ పాల్గొన్నారు.  

ఎంపీ, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ

వేల్పూర్‌: వేల్పూర్‌ క్రాస్‌ రోడ్డులో భాజాపా ఆధ్వర్యంలో చేపట్టిన రైతుధర్నా స్థలం వద్ద ఎంపీ అర్వింద్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు వ్యతిరేకంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజల పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని