logo

రోడ్డు ప్రమాదాలపై తక్షణ స్పందన

రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు పతి క్షణం ఎంతో విలువైంది. బాధితులకు వేగంగా సేవలు అందించి ప్రాణాలు కాపాడం చాలా ముఖ్యం. దీన్ని గుర్తించిన ఇందల్‌వాయి టోల్‌ప్లాజా యాజమాన్యం తమ పరిధిలోని రహదారిపై సేవలను విస్తరించింది.

Published : 30 Sep 2022 03:21 IST

ఇందల్‌వాయి టోల్‌ప్లాజా పరిధిలో మెరుగైన సేవలు

న్యూస్‌టుడే, ఇందల్‌వాయి

చంద్రాయన్‌పల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారి

రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు పతి క్షణం ఎంతో విలువైంది. బాధితులకు వేగంగా సేవలు అందించి ప్రాణాలు కాపాడం చాలా ముఖ్యం. దీన్ని గుర్తించిన ఇందల్‌వాయి టోల్‌ప్లాజా యాజమాన్యం తమ పరిధిలోని రహదారిపై సేవలను విస్తరించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజాల కంటే సత్వరమే స్పందిస్తున్నట్లు జాతీయ రహదారుల సంస్థ నుంచి ప్రశంసలు పొందింది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్వహణలో మారిన పరిస్థితులు, అందుతున్న అత్యవసర సేవలపై ప్రత్యేక కథనం...

అత్యవసర టెలిఫోన్‌: రహదారి వెంట ప్రతి 2 కి.మీ ఒకటి చొప్పున ఉన్నాయి. కేవలం ఒక బటన్‌ నొక్కడంతో టోల్‌ప్లాజాలోని కంట్రోల్‌ రూంకు కనెక్ట్‌ అవుతుంది. ప్రయాణికులు వారి పరిస్థితిని వివరిస్తే అవసరమైన సహాయం చేస్తారు. ప్రమాద సమయాల్లోనే కాకుండా వాహనం మొరాయించినప్పుడు, ఇంధనం లేక మధ్యలో నిలిచిపోయినా స్పందిస్తారు.


హైవే పెట్రోలింగ్‌ వాహనం: ఇవి 30 కి.మీ ఒకటి చొప్పున అందుబాటులో ఉంటాయి. నిరంతరం రహదారిపై తిరుగుతుంటాయి. వీరి వద్ద ఎప్పుడు 5 లీటర్ల డీజిల్‌, పెట్రోల్‌ నిల్వ ఉంచుతారు. ఇంధనం లేక ఏదైనా వాహనం నిలిచిపోతే వారికి అందజేసి, సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తారు.


అంబులెన్సు: ఇవి కూడా 30 కి.మీ ఒకటి చొప్పున ఉన్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హెచ్‌టీఎంఎస్‌ కంట్రోల్‌ రూం సిబ్బంది సంబంధిత అంబులెన్సు డైవర్‌కు సమాచారం అందిస్తారు. సుశిక్షుతులైన సిబ్బందితో ప్రథమ చికిత్స అందిస్తూ నిమిషాల్లో దవాఖానాలకు చేరవేస్తున్నారు. మొత్తం 40 మంది సిబ్బందిని సేవల కోసం వినియోగిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.


హైడ్రా(క్రేన్‌): ప్లాజా పరిధిలో ఒకటి ఉంది. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుకు అడ్డుగా పడిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారితే దీని సాయంతో వాటిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తారు.


బాధ్యత పెరిగింది
- చలపతి, టోల్‌ప్లాజా మేనేజర్‌, ఇందల్‌వాయి

లోపాలను సవరించుకుంటూ వేగంగా సేవలు అందిస్తున్నాం. ప్రమాదం జరిగిన సమయంలో మొదటి గంట క్షతగాత్రులకు చాలా కీలకం. వారిని కాపాడేందుకు సిబ్బందికి నిరంతరం శిక్షణ ఇస్తున్నాం. రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏడు నిమిషాల్లోనే స్పందిస్తున్నామని స్వయంగా టోల్‌ఫ్రీ నివేదికలో వెల్లడైంది. దీంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. వాహనదారుల సౌకర్యార్థం టోల్‌ప్లాజా పరిధిలో రెండుచోట్ల మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని