logo

అప్పుడు మెదక్‌లో.. ఇప్పుడు జహీరాబాద్‌లో

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్న కామారెడ్డి, ఎల్లారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌ అసెంబ్లీ స్థానాలు 2009కి ముందు మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉండేవి.

Updated : 16 Apr 2024 06:39 IST

పునర్విభజనతో మారిన అసెంబ్లీ నియోజకవర్గాలు
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

హీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్న కామారెడ్డి, ఎల్లారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌ అసెంబ్లీ స్థానాలు 2009కి ముందు మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉండేవి. అలాగే ప్రస్తుతం జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో కొనసాగుతున్న జుక్కల్‌, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉండేవి. పైన పేర్కొన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు 2004లో చివరిసారిగా ఆయా లోక్‌సభల పరిధిలోనే ఎన్నికలు నిర్వహించారు. ఇక 2008లో లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగింది. అందులో భాగంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్తగా జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం ఆవిర్భవించింది. ఈ స్థానానికి 2009లో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు.

నిజామాబాద్‌ పరిధిలోకి కోరుట్ల, జగిత్యాల

2009కి ముందు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి మినహా ఏడు నియోజకవర్గాలు ఈ లోక్‌సభ స్థానంలో ఉన్నాయి. అయితే 2008లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో జుక్కల్‌, బాన్సువాడ అసెంబ్లీ స్థానాలను జహీరాబాద్‌లో కలిపారు. నిజామాబాద్‌ స్థానానికి కొత్తగా కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ స్థానాలను చేర్చారు. 2009 నుంచి ఇదే విధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

ప్రముఖుల పోటీ..

మెదక్‌ లోకసభ స్థానం నుంచి చాలా మంది ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన వారిలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకరు. 1980వ సంవత్సరంలో అనూహ్యంగా మెదక్‌ లోకసభ స్థానం నుంచి బరిలో నిలిచి రెండు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి నుంచే మెదక్‌ జిల్లా ప్రత్యేకత సంతరించుకుంది. ఇకా బాగారెడ్డి మెదక్‌ లోక్‌సభ నుంచి నాలుగుమార్లు ఎంపీగా విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజవర్గాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పటికీ ఇందిరాగాంధీ గురించి ఇక్కడి ఓటర్లు చెప్పుకొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని