logo

సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!

పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది.

Updated : 18 Apr 2024 06:22 IST

వినియోగంపై అవగాహన అవసరం
న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. మరో ఘటనలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి ఓ యువతి చేసిన నిర్వాకం ఎలా వినియోగించుకోకూడదో తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన నిఖిత అనే బాలిక ఇంట్లో ఎవరూ లేనప్పుడు తన 15 నెలల వయసున్న మేనకోడలుతో ఆడుకుంటుంది. అప్పుడు కోతుల మంద వారింట్లోకి ప్రవేశించాయి. ఒక వానరం వారి వద్దకు వచ్చింది. దీంతో నిఖితకు తమ ఇంట్లో ఉన్న వర్చువల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ పరికరం ‘అలెక్సా’ గుర్తుకొచ్చింది. వెంటనే కుక్కలా మొరగాలని అలెక్సాను ఆదేశించిందా బాలిక.తర్వాత అలెక్సా చేసిన శునక శబ్దాలకు వానరాలు పారిపోవడంతో ఇద్దరికి అపాయం తప్పింది.

మరో ఘటనలో రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడి స్నేహితుల వద్ద అప్పు చేసింది. ఒత్తిడి రావడంతో ఇంట్లో రూ.25 వేలు అపహరించి వస్తువులను చిందరవందరగా పడేసి దొంగలు పడ్డారని నమ్మించే ప్రయత్నం చేసింది. టెక్నాలజీ సాయంతో విచారించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే తప్పు చేసినట్లు అంగీకరించింది.

భిన్నమైనవే  అయినా..

రెండు ఘటనలు భిన్నమైనవే అయినా... సాంకేతికత విషయంలో మన పిల్లల పరిస్థితి ఏమిటన్నది తల్లిదండ్రులు ప్రశ్నించుకోవడానికి దోహదం చేయనున్నాయి. సమస్యలు అధిగమించడానికి సాంకేతికతను ఉపయోగించాలని, ఇబ్బందుల బారిన పడేందుకు వినియోగించొద్దని పిల్లలకు అవగాహన కల్పించాలి. మరోవైపు జిల్లాలోనూ వానరాలు, శునకాల స్వైర విహారం చేస్తున్న గ్రామాలు చాలానే ఉన్నాయి. వాటి దాడిలో పిల్లలు గాయపడిన ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తున్నాయి. ఎటైనా వెళ్తున్నప్పుడు అవి ఎదురైతే భయపడకుండా ఎలా వ్యవహరించాలో నేర్పించాలి.

జిల్లాలో జరిగిన ఘటనలు..

టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలియక కొందరు చిన్నారులు సమస్యల బారిన పడ్డారు. వారిలో జిల్లాకు చెందిన ఓ బాలుడు ఇటీవలే ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడుతూ అప్‌డేట్‌ అంటూ వచ్చిన ఆప్షన్లు ఎంపిక చేసుకుంటూ, ఓటీపీ చెబుతూ ఖాతా నుంచి రూ.70వేలకు పైగా పోగొట్టిన ఘటన వెలుగు చూసింది. ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని తెలియకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది.

గతంలో సైతం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయింది. సదరు వ్యక్తి విద్యార్థినిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి అనే దానిపై అవగాహన లేకపోవడమే మోసపోవడానికి కారణమైంది.

ప్రయోజనాలు  ఇలా..

మరి అదే టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోజనం పొందుతున్న విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి వారిలో జిల్లా కేంద్రానికి చెందిన హారిక ఒకరు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా తాను మెడిసిన్‌ చదవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి స్మార్ట్‌ఫోన్‌ను ఆయుధంగా మలచుకుంది. అందులో ఆన్‌లైన్‌ తరగతులు విని మంచి ర్యాంకు రావడంతో సిద్దిపేట వైద్య కళాశాలలో సీటు లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని