logo

పట్టణ ఓటర్లారా..బాధ్యత మరవొద్దు

పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్‌కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది.

Updated : 30 Apr 2024 06:47 IST

పోలింగ్‌ శాతంలో వెనుకబాటు

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌: పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్‌కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. అయితే ఎక్కడో జరిగిన పోలింగ్‌ సరళి మనకు ఎందుకు అనుకోవడానికి లేదు. జిల్లాలోనూ అందుకు సంబంధించిన ఆనవాళ్లు మనకు గత పోలింగ్‌ సరళిలో కనిపిస్తాయి. నిజామాబాద్‌ నగరం ఎప్పుడు పోలింగ్‌లో వెనుకబడే ఉంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికల లెక్కల ప్రకారం చూస్తే నియోజకవర్గంలో పట్టణ ఓటర్లు 35.6 శాతం మంది ఉంటే గ్రామీణ పరిధిలో 64.4 శాతం మంది ఉన్నారని అంచనా వేశారు. ఈ ఎన్నికల్లోనూ పట్టణ ఓటర్ల శాతంలో వృద్ధి ఉండొచ్చు కానీ తగ్గడమైతే ఉండదనే వాదన ఉంది.

పోటెత్తుతున్న  గ్రామీణులు..

ఏ ఎన్నికలు తీసుకున్నా ఉమ్మడి జిల్లాలో పట్టణ ఓటర్లకంటే గ్రామీణులే పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. పట్టణాల్లో ప్రతి ఎన్నికకు మధ్య స్వల్ప పెరుగుదల నమోదవుతోంది. ఎన్నికల సంఘం ఓటు విలువ తెలిపేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా లాభం ఉండటం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంపై ఎందుకింత నిర్లిప్తత ఆవహించిందంటూ నాగ్‌పూర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ తదుపరి విడతల్లో పోలింగ్‌ జరగనున్న నగరాలు, పట్టణ ఓటర్లకు వర్తిస్తుందనే విషయం గ్రహించాలి.

‘‘మీకు తెలుసా

10,15,937 మంది నాగ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. సిగ్గు చేటు. జారీ చేసిన వారు అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకలో పాల్గొన్న పౌరులు’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఒక ఫొటో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి ఇటీవల బెంగళూరు నగరంలోని మూడు నియోజకవర్గాల్లో 55 శాతం దాటని పోలింగ్‌ సరళిని జోడిస్తున్నారు.

వ్యత్యాసం..

ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2018 శాసనసభ ఎన్నికల కంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదుకావడం గమనార్హం. గత ఏడాది శాసనసభ ఎన్నికల్లోనూ నిజామాబాద్‌ అర్బన్‌ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కానీ 2018తో (62.65) పోలిస్తే 2023 పోలింగ్‌ శాతంలో (68.56)    పెరుగుదల కనిపించింది. పట్టణ ఓటర్లు ఉండే కామారెడ్డి నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం 2018 (78.83) కంటే 2019 (67.45), 2023 (74.86) ఎన్నికల్లో తక్కువగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని