logo

ఇంకుడు గుంతలపై మొక్కుబడి సర్వే

ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

Published : 30 Apr 2024 05:47 IST

జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద సర్వే చేస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం: ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పురపాలికల్లో ఇంకుడుగుంతలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 చదరపు మీటర్లు కలిగిన ప్రతి నిర్మాణానికి ఇంకుడు గుంత ఉండేలా అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. లేనివాటికి రెండు వారాల్లో నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కానీ, నగరపాలక సంస్థ అధికారులు సర్వేపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నెల గడిచినా ఇప్పటి వరకు సర్వే పూర్తి చేయలేదు.

 కమిటీల ఏర్పాటు 

పురపాలికల పరిధిలోని కమిషనర్ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్య పర్యవేక్షకులు, ఇతర అధికారులను కమిటీ సభ్యులుగా నియమించారు. వీరు వార్డుల వారీగా క్షేత్రస్థాయిలోని భవనాలు, అపార్ట్ట్‌మెంట్లను పరిశీలించి వాస్తవ పరిస్థితులపై నివేదిక రూపొందించాల్సి ఉంటుంది.  

వర్షాకాలంలోపు పూర్తి చేయాల్సి ఉన్నా..

జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ పరిధిలో సర్వే నత్తనడకన సాగుతోంది. ఇటీవల నాలుగు బృందాలతో (ఒక్క బృందంలో నలుగురు సభ్యులు) సర్వే చేయించారు. అపార్ట్‌మెంట్లు మాత్రమే గుర్తించారు. వీటిలో ఏయే నిర్మాణాలకు ఇంకుడు గుంతలున్నాయో వేటికి లేవో లెక్కతేల్చాల్సి ఉంది. వార్డు అధికారులకు ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో సర్వే మధ్యలోనే నిలిచిపోయింది. వర్షాకాలం లోపు సర్వే పూర్తి చేసి ఇంకుడు గుంతలు నిర్మించాల్సి ఉంది.

నిర్వహణపై నిర్లక్ష్యం

2022లో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇంకుడు గుంతలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో నిర్మాణాలు చేపట్టింది. ఆ తర్వాత నిర్వహణ మరిచారు. నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో 119 ఇంకుడు గుంతలు తవ్వారు. వీటిని పరిశీలిస్తే పిచ్చిమొక్కలు, పూడికతో నిండిపోయాయి.


ఎన్నికల విధులు అప్పగించారు
- కరుణాకర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి

అపార్టుమెంట్ల సర్వే పూర్తిచేశాం. 300 చ.మీ మీటర్లు ఉన్న నివాస గృహాలు 651 ఉన్నట్లు గుర్తించాం. వాటిలో వార్డు అధికారులు సర్వే చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో చాలా మంది విధుల్లో ఉన్నారు. ఉన్నవారితో సర్వే చేయిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని